గురువారం 02 జూలై 2020
National - Jun 16, 2020 , 10:53:16

పాత మంచం కిర్రు చ‌ప్పుళ్లెందుకో: శివ‌సేన

పాత మంచం కిర్రు చ‌ప్పుళ్లెందుకో: శివ‌సేన

  • సంకీర్ణ భాగ‌స్వామిపై సామ్నాలో వ్యంగ్య వ్యాఖ్య‌లు

ముంబై: మ‌హారాష్ట్ర సంకీర్ణ స‌ర్కారులో లుక‌లుక‌లు మొద‌ల‌య్యాయి. శివ‌సేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ క‌లిసి ఏర్పాటు చేసిన‌ మ‌హా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్ర‌భుత్వంలో శివ‌సేన, కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య విభేదాలు త‌లెత్తాయి. మ‌హారాష్ట్ర‌లోని అధికార యంత్రాంగం సంకీర్ణ స‌ర్కారులో చిచ్చురేపేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ద‌ని ఇటీవ‌ల‌ కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్య‌ల‌పై శివ‌సేన స్పందించింది. శివ‌సేన మౌత్ పీస్ అయిన‌ సామ్నా ప‌త్రిక‌ సంపాద‌కీయంలో కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి వ్యంగ్య వ్యాఖ్య‌లు చేసింది. 

'కాంగ్రెస్ నేత‌లు బాలా సాహెబ్ థొరాట్‌, అశోక్ చ‌వాన్ ఇటీవ‌ల రాష్ట్ర‌ ప్ర‌భుత్వం తీరుపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. సంకీర్ణంలో  త‌మ పార్టీకి అన్యాయం జ‌రుగుతుంద‌ని వ్యాఖ్యానించారు. ఇప్పుడేమో అధికారులే సంకీర్ణంలో విభేదాలు సృష్టిస్తున్నార‌ని బ్యూరోకాట్ల‌ను నిందిస్తున్నారు' అని సామ్నా సంపాద‌కీయంలో పేర్కొన్నారు. ఇటీవ‌ల ఓ ఇంగ్లిష్ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అశోక్ చ‌వాన్ మాట్లాడుతూ.. బ్యూరోక్రాట్లే సంకీర్ణ స‌ర్కారులో చిచ్చు రేపుత‌న్నార‌ని వ్యాఖ్యానించారు. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ తీరును ఎద్దేవా చేస్తూ శివ‌సేన పార్టీ సామ్నాలో వ్యంగ్య వ్యాఖ్య‌లు చేసింది. 

'కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బాగానే ప‌నిచేస్తున్న‌ది. కానీ అప్పుడ‌ప్పుడు పాత మంచం (కాంగ్రెస్ పార్టీ) కిర్రు చ‌ప్పుళ్లు చేస్తున్న‌ది. ఆ పాత మంచం త‌న‌ ఇద్ద‌రు మంత్రులు ముఖ్యమంత్రిని క‌లిసి త‌మ స‌మ‌స్య‌లపై చ‌ర్చించాల‌ని నిర్ణ‌యించింది. ముఖ్య‌మంత్రి వారితో మాట్లాడి మంచి నిర్ణ‌య‌మే తీసుకుంటారు. అయితే, కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పాల‌నుకుంటున్న‌ది. ఆ పాత మంచం ఎందుకు కిర్రు చ‌ప్పుళ్లు చేస్తున్న‌ది?' అని సామ్నా సంపాద‌కీయంలో శివ‌సేన ప్ర‌శ్నించింది. 


logo