ఆదివారం 12 జూలై 2020
National - Jun 17, 2020 , 20:15:34

అమర సైనికుల సంఖ్య మనమే ఎందుకు చెప్తాం!?

అమర సైనికుల సంఖ్య మనమే ఎందుకు చెప్తాం!?

ఇల్లు, వాకిలీ మరిచిపోయి కంటి మీద రెప్ప వాల్చకుండా సరిహద్దుల్లో ఉంటూ దేశ రక్షణలో ఎందరో వీర మరణం పొందుతున్నారు. ప్రతీ దేశంలోనూ ఇలా  సైనికులు మరణాలు షరా మామూలే. దేశ రక్షణలో శత్రు సైన్యం చేతిలో వీర మరణం  పొందుతున్న సైనికుల సేవలను, త్యాగాలను ఎన్ని దేశాలు గుర్తుంచుకొంటున్నాయి. దేశ రక్షణలో ప్రాణాలను అర్పిస్తున్న వారిని గుర్తిస్తే, వారి కీర్తి ప్రతిష్టలను శ్లాఘిస్తే.. అది ఆ దేశానికి, సైన్యంలో చేరేందుకు ఆ దేశంలోని పౌరులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుందనడంలో ఎలాంటి ఔచిత్యం  లేదు. దేశం కోసం సైనికుల త్యాగాలు అసమానమైనవి. భార్యా పిల్లల్ని, తల్లిదండ్రులను మ‌రిచిపోయి.. శ‌త్రువుల‌తో పోరాడ‌టానికి క‌ద‌న‌రంగంలోకి దిగుతుంటారు. ఇందులో ఎందరో సైనికులు చ‌నిపోతుంటారు.

గప్‌చుప్‌గా ఉంటారెందుకో?

శత్రువుల చేతిలో వీర మరణం పొందుతున్న సైనికుల సేవలను మన దేశం కొనియాడుతూ.. వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటోంది. అయితే, కొన్ని దేశాలు మాత్రం వారి సైనికులను పట్టించుకోవు. వారి త్యాగాల‌ను కీర్తించవు. ఎంత మంది చనిపోయారు అనేదానిపై మాత్రమే లెక్క‌లు వేసుకొంటాయి. ప్ర‌త్య‌ర్థులు ఎక్కువ సంఖ్య‌లో మ‌ర‌ణిస్తే.. ఘ‌న‌త‌గా చెప్పుకొంటాయి. లేదంటే గ‌ప్ చుప్‌గా ఉండిపోతాయి. సైనికుల‌ను త్యాగాల‌ను గెలుపు, ఓట‌ముల‌తో చూడ‌కుండా.. దేశం కోసం పోరాడిన ముద్దుబిడ్డ‌లు అంటూ ఆకాశానికి ఎత్తుకోవడం ఒక్క మన దేశానికే చెల్లుతుంది. మరే దేశమూ తమ సైనికులు ఇంతమంది చనిపోయారని చెప్పడానికి కూడా వెనుకంజ వేస్తుంటాయి. వీర సైనికుల మరణాలను కూడా రాజకీయాలకు వాడుకొంటుంటారు. 

ప్రస్తుతం చైనా సైన్యం దుందుడుకు చర్యల్లో 20 మంది భారత సైనికులు వీర‌ మ‌ర‌ణం పొందారు. గ‌ల్వాన్ లోయ వ‌ద్ద‌ ఘ‌ర్ష‌ణ చెలరేగడంతో చైనా సైన్యం కాల్పులు జరిపి ఇండియా సైనికులను పొట్టన పెట్టుకొన్నారు. ఇక్క‌డ భార‌త‌దేశం మాత్రం త‌మ వైపు ఎంతో మంది చనిపోయారో వెల్లడించగా.. చైనా మాత్రం తమ వాళ్లు ఎంత మంది చనిపోయారన్నది ఇంతవరకు వెల్ల‌డించ‌లేదు. సైనికుల మ‌ర‌ణాలు లెక్కలేసి ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్ట‌డం ఇష్టం లేక‌నే చనిపోయినవారి సంఖ్యను తమ దేశం బ‌హిర్గ‌తం చేయ‌డం లేద‌ని.. ఇది బీజింగ్ మంచిత‌నం అంటూ చైనా అధికారిక ప‌త్రిక‌ గ్లోబ‌ల్ టైమ్స్ సంపాదకుడు హుషీజిన్ వెల్ల‌డించ‌డం ఇక్కడ గ‌మ‌నించాల్సి విషయం. 

భార‌త్ చ‌రిత్ర‌ను ప‌రిశీలిస్తే..

సైనికులు చేసిన త్యాగాల‌ను ఏనాడూ భారత్‌ మరిచిపోలేదు. వారి వీర మరణాలను గెలుపోట‌ముల‌తో చూడ‌లేదు. 1962లో చైనా యుద్ధంలో ర‌జాంగ్‌లా వ‌ద్ద మేజ‌ర్ సైతాన్ సింగ్ వీరోచితంగా పోరాడి వీర‌మ‌ర‌ణం పొందారు. ఆయనకు సైన్యంలో అత్యున్న‌త‌మైన ప‌ర‌మ్ వీర చ‌క్ర అవార్డు ప్ర‌క‌టించి భారత్‌  గౌరవించింది. అలాగే, ఆయన స్మారకంగా ఓ ఆయిల్ ట్యాంక‌ర్‌కు ఆయ‌న పేరు పెట్టారు. కేంద్ర ప్ర‌భుత్వ ఆధ్వర్యంలోని gallantryawards.gov.inలో వెళ్ల‌గానే సైతాన్ సింగ్ పేరు అందరికన్నా పైన క‌నిపిస్తుంది. చైనాతో జ‌రిగిన యుద్ధంలో పోరాడిన‌ రైఫిల్ మ్యాన్ జ‌స్వంత్ సింగ్ రావ‌త్‌కు భారత ప్రభుత్వం మ‌హావీర చ‌క్ర పురస్కారంతో సత్కరించింది. ఇలా చెప్పుకొంటూ పోతే వందల సంఖ్యలో అశోక చక్ర, మహావీర చక్ర, పరమవీరచక్ర.. ఇలా ఎన్నో కీర్తి పురస్కారాలతో సత్కరించారు.

బాలాకోట్‌ ఘటనలోనూ మనమే..

బాలాకోట్ ఘ‌ట‌నలో అభినంద‌న్ వ‌ర్ధ‌మాన్ విమానం పాకిస్తాన్‌లో కూలిపోగానే ఆ విష‌యాన్ని ధ్రువీక‌రించుకొన్న భారత్‌.. వెంట‌నే ప్ర‌పంచదేశాలకు తెలియ‌జేసింది. అదే స‌మ‌యంలో పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్ 16 విమానం కూలిపోయినా ఆ విషయాన్ని ప్ర‌పంచానికి వెల్ల‌డించ‌లేదు. రాడార్ సిగ్నెచ‌ర్ నుంచి అదృశ్య‌మైన‌ట్లు స్ప‌ష్ట‌మైన ఆధారాలున్నప్పటికీ పాకిస్తాన్‌ బుకాయిస్తూ వచ్చింది.

1967 సెప్టెంబ‌ర్ 11న‌.. సిక్కిం స‌మీపంలో నాథులా స్థావ‌రంపై చైనా సైనికులు దాడులు చేసిన సందర్భంలో భార‌త్ ధీటుగా స్పందించ‌డంతో చైనా సైన్యం వెన‌క్కి త‌గ్గింది. మ‌రో నెల రోజుల త‌ర్వాత‌ అక్టోబ‌ర్ 01న‌ చోలా స్థావ‌రంపై దాడికి తెగ‌బ‌డ్డారు. ఇక్క‌డ కూడా  భార‌త్ తీవ్రంగానే స్పందించడంతో ఒక్క‌రోజులోనే చైనా తోక‌ముడిచిందని చరిత్ర చెప్తోంది. ఈ దాడుల్లో భార‌త్ త‌ర‌పున పోరాడి 88 మంది సైనికులు చనిపోయారు. చైనా సైనికులు 340 మంది వ‌ర‌కు మృతిచెంది, దాదాపు 450 మందికి గాయపడినా.. చైనా మాత్రం ఎంతమంది చనిపోయారో, మరెంత మంది గాయపడ్డారో  ఇప్ప‌టికీ చెప్ప‌కుండా మిన్నకుండిపోయింది. 

చివరగా.. అతిపెద్ద ప్ర‌జాస్వామ్య దేశమైన భారత్‌లో ప్ర‌తీ దానికి లెక్కలు చెప్పాల్సిందే. అది  అభివృద్ధి నిధులైనా.. శత్రువుల చేతిలో వీర మరణం పొందిన సైనికులైనా.. 


logo