గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 01, 2020 , 11:22:19

స్వజాతి భక్షణ

స్వజాతి భక్షణ
  • సహచర ఎలుగుల్ని చంపి తింటున్న
  • ధృవప్రాంత ఎలుగుబంట్లు
  • భూతాపం కారణంగా ఆహార కొరత
  • సమస్యను తీవ్రతరం చేస్తున్న శిలాజ ఇంధనాల వెలికితీత

మాస్కో, ఫిబ్రవరి 29: ఆర్కిటిక్‌లో తెల్లగా మెరువాల్సిన మంచు పొరలు.. ధృవపు ఎలుగుబంట్ల రక్త ధారలతో ఎరుపు రంగును సంతరించుకుంటున్నాయి. వేటాడేందుకు జీవులు దొరక్క అక్కడి ఎలుగుబంట్లు ఆకలితో అలమటిస్తున్నాయి. ఆకలి బాధను తీర్చుకోవడానికి సహచర ఎలుగుబంట్లపై దాడి చేసి.. చంపి వాటి మాంసాన్ని తింటున్నాయి. ధృవ ప్రాంతాల్లో జరుగుతున్న ఈ ‘ఘోర జంతు కలి’ గురించి రష్యా శాస్త్రవేత్తలు వెల్లడించారు.


మారుతున్న అలవాట్లు

యావత్‌ ప్రపంచంలో ప్రతి జీవికి ఉండే లక్షణం ఆకలి. శరీర నిర్మాణం, నివసించే ప్రాంతం, వాతావరణ పరిస్థితులను అనుసరించి జీవుల ఆహారపుటలవాట్లు ఆధారపడి ఉంటాయి. అయితే, గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా పర్యావరణంలో అనూహ్య మార్పులు జరిగి ఆర్కిటిక్‌ తీవ్రంగా ప్రభావితమవుతున్నది. వాతావరణ ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగిపోతుండటంతో గత 25 ఏండ్లలో అక్కడ దాదాపు 40 శాతానికి పైగా మంచు కరిగిపోయినట్టు నివేదికలు చెబుతున్నాయి. పెద్దమోతాదులో మంచు కరిగిపోతుండటంతో ఆర్కిటిక్‌లో నివసిస్తున్న ధృవపు ఎలుగుబంట్లు తమ ఆహారపుటలవాట్లను కూడా  మార్చుకుంటున్నాయని మోర్డ్‌వింట్‌సేవ్‌ అనే రష్యా శాస్త్రవేత్త తెలిపారు. ధృవపు ఎలుగుబంట్లు సాధారణంగా మంచు పొరల కింద నీటిలో సంచరించే సీల్స్‌ను ఆహారంగా తీసుకుంటాయి. భూతాపం పెరుగుతుండటంతో ధృవ ప్రాంతాల్లో మంచు కరిగిపోవడం ఎక్కువవుతున్నది. దీంతో ధృవప్రాంతాల్లోని సముద్రం నీటిపై తగినంత మంచు నిల్వలు లేకపోవడంతో వాటిపై ఎలుగులకు నిలబడే అవకాశం ఉండట్లేదు.


 ఫలితంగా నీటిలోని సీల్స్‌ను వేటాడేందుకుఎలుగుబంట్లకు సాధ్యం కావడంలేదు. దీంతో వాటికి ఆహార కొరత ఏర్పడుతున్నది. ఈ కారణంగా తమ ఆహారపుటలవాట్లను క్రమంగా మార్చుకుంటున్నాయి. ఆకలిని తీర్చుకొని, తద్వారా బతకడానికి సహచర ఎలుగుబంట్లను చంపి తింటున్నాయని మోర్డ్‌వింట్‌సేవ్‌ పేర్కొన్నారు. ‘తోటి ఎలుగుబంట్లను చంపి తినడం అనేది ఎప్పటి నుంచో ఉన్నది. అయితే, అది చాలా అరుదుగా జరిగేది. కానీ ఆ ప్రక్రియ ఈ మధ్య కాలంలో ఎక్కువవ్వడం ఆందోళన కలిగిస్తున్నది’ అని ఆయన తెలిపారు. ఆడ ఎలుగులను, వాటి పిల్లల్ని చంపి తినడం సులువు కావడంతో.. మగ ఎలుగులు వాటినే లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతున్నట్టు తాము గుర్తించామని ఆయన తెలిపారు. కొన్ని తల్లి ఎలుగులు తమ పిల్లల్ని కూడా తింటున్నట్టు ఆయన వెల్లడించారు. 


మంచులో కళేబరాలు

ఆర్కిటిక్‌ ధృవ ప్రాంతాల నుంచి శిలాజ ఇంధనాల్ని వెలికితీయాలన్న పారిశ్రామిక కంపెనీల చర్యలు కూడా అక్కడి ఎలుగు బంట్ల ఆహారపు గొలుసును విచ్చిన్నం చేయడానికి మరో కారణమని మోర్డ్‌వింట్‌సేవ్‌ ఆరోపించారు.  మరోవైపు, చంపిన ఎలుగుల మాంసాన్ని దశల వారీగా తినడానికి వాటి కళేబరాల్ని మగ ఎలుగులు మంచు పొరల్లో కప్పి ఉంచుతున్నాయని మరో అధ్యయనం వెల్లడించింది. 


logo