బుధవారం 25 నవంబర్ 2020
National - Nov 15, 2020 , 18:42:29

బీహార్ డిప్యూటీ సీఎం ఎవ‌రు..?

బీహార్ డిప్యూటీ సీఎం ఎవ‌రు..?

ప‌ట్నా: బీహార్‌లో రేపు (సోమ‌వారం) నూతన ప్రభుత్వం కొలువుదీర‌నుంది. అందుకోసం అన్ని ఏర్పాట్లు ద‌నాద‌న్ జరుగుతున్నాయి. ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి నితీశ్‌కుమారే రేపు సాయంత్రం నాలుగున్న‌ర‌కు నూత‌న ముఖ్య‌మంత్రి ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌బోతున్నారు. ఆయ‌న‌తోపాటు ప‌లువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్ర‌మాణం చేయ‌బోతున్నారు. అయితే, ఎవ‌రెవ‌రికి ఏ శాఖ కేటాయించ‌నున్నార‌నే విష‌యాన్ని మాత్రం ఎన్డీఏ ఇంకా ర‌హ‌స్యంగానే ఉంచింది. 

మ‌రోవైపు బీహార్‌లో కాబోయే ఉపముఖ్య‌మంత్రి ఎవ‌ర‌నే విష‌యాన్ని కూడా ఎన్డీఏ ఇంకా స్ప‌ష్టంచేయ‌లేదు. ఈ నేప‌థ్యంలో డిప్యూటీ సీఎం పదవిని మ‌ళ్లీ బీజేపీ నేత‌ సుశీల్‌మోదీకే క‌ట్ట‌బెడుతారా లేదంటే మరొక‌రికి ఆ ప‌ద‌వి అప్ప‌గిస్తారా అనే విష‌యంలో స‌స్పెన్స్ నెల‌కొన్న‌ది. ఈ క్ర‌మంలో సుశీల్ మోదీకి బ‌దులుగా ఇద్దరు కొత్త వ్యక్తులను డిప్యూటీ సీఎంలుగా నియమిస్తారనే ప్ర‌చారం జ‌రుగుతున్న‌ది. 

ప్రధానంగా బీజేపీ సీనియర్‌ నేత కిషోర్‌ ప్రసాద్‌తోపాటు రేణు దేవిని డిప్యూటీ సీఎంలుగా నియ‌మించ‌నున్నార‌నే ప్ర‌చారం బీహార్‌లో జోరందుకున్న‌ది. వారిద్ద‌రూ సోమ‌వారం నితీశ్‌తోపాటే ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. అయితే ఇక్క‌డ సుశీల్ మోదీకి డిప్యూటీ సీఎం ప‌ద‌విని ఎవ‌రూ నిరాక‌రించ‌లేద‌ని, ఆయ‌నే ఆ ప‌ద‌విపై అయిష్ట‌త క‌న‌బ‌ర్చార‌ని బీజేపీ వ‌ర్గాలు చెబుతున్నాయి.  

నితీష్‌ కేబినెట్‌లో కీలకమైన శాఖ‌లు బీజేపీకి దక్కే అవకాశం ఉండటంతో సుశీల్ మోదీ ఒక బ‌ల‌మైన శాఖ‌ను కోరుకుంటున్న‌ట్లు తెలిసింది. సుశీల్ కోరిక మేర‌కు ఆయ‌న‌కు బ‌ల‌మైన మంత్రిత్వ శాఖ‌ను క‌ట్ట‌బెట్టేందుకు అంగీకారం కుదిరిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారాన్ని బ‌ట్టి స్ప‌ష్ట‌మవుతున్న‌ది. ఇదిలావుంటే బీజేపీ ఎమ్మెల్యేల్లో చాలా మంది మంత్రి ప‌ద‌వులు ఆశిస్తున్నార‌ని, శాఖ‌లు కేటాయించిన త‌ర్వాత బీజేపీలో అసంతృప్తులు వెల్ల‌డ‌య్యే అవ‌కాశం ఉన్న‌ద‌ని మరో ప్ర‌చారం జ‌రుగుతున్న‌ది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.