శనివారం 24 అక్టోబర్ 2020
National - Sep 30, 2020 , 19:01:25

కరోనా నియంత్రణలో ఒడిశా భేష్.. ప్రశంసించిన డబ్ల్యూహెచ్ఓ

కరోనా నియంత్రణలో ఒడిశా భేష్.. ప్రశంసించిన డబ్ల్యూహెచ్ఓ

భువనేశ్వర్: కరోనా నియంత్రణకు ఒడిశా ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రశంసించింది. ఒకవైపు అంఫాన్ తుఫాన్ ప్రభావం, మరోవైపు వలస కూలీల ప్రవాహం ఉన్నప్పటికీ కరోనా మహమ్మారిని సమర్థవంతంగా నిర్వహించడాన్నికొనియాడింది. ‘ప్రభుత్వం నుంచి కమ్యూనిటీ స్థితిస్థాపకత: కొవిడ్19 పట్ల ఒడిశా ప్రతిస్పందన’ అనే ఆర్టికల్‌ను తన వెబ్‌‌సైట్‌లో ప్రచురించింది. కరోనా వ్యాప్తి నివారణ, రోగుల నిర్వహణ పట్ల ఒడిశా ప్రభుత్వం తీసుకున్న చర్యలను అందులో ప్రశంసించింది. ‘కరోనా నేపథ్యంలో చిక్కుకున్న ప్రజలను భౌతిక దూరం నిబంధనలతో తరలించడం సవాలుతో కూడిన అంశం. విపత్తుల నిర్వహణలో ఒడిశా రాష్ట్రానికి ఉన్న అనుభవం దీనికి సహాయపడింది. పంచాయతీ రాజ్ సంస్థలు, కమ్యునిటీ వర్గాలతో ప్రభుత్వం సమర్థవంతంగా సమన్వయం చేసుకోవడం వల్ల వైరస్ వ్యాప్తిని నివారించగలిగింది’ అని ఆ కథనంలో పేర్కొంది. వలస కూలీలు భారీ సంఖ్యలో రాష్ట్రానికి తిరిగివచ్చినప్పటికీ కరోనా కేసుల సంఖ్య తక్కువగా ఉండేట్లుగా ప్రభుత్వం చేపట్టిన వ్యూహాత్మక కరోనా నియంత్రణ నిర్వాహణ పద్ధతులు ఎంతో కీలకమని ప్రశంసించింది.

కరోనా కేసు వెలుగులోకి రాకముందే మార్చి 13 నుంచే బహిరంగ ప్రాంతాలను మూసివేసిన రాష్ట్రాల్లో ఒడిశా తొలి రాష్ట్రమని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. మార్చి 15న ఆ రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదు కాగా వెంటనే కరోనా నియంత్రణ గదులను అందుబాటులోకి తెచ్చారని, జిల్లా స్థాయి ఆరోగ్య అధికారులను సన్నద్ధం చేయడంతోపాటు చేతుల శుభ్రత, మాస్కుల ధరించడం, భౌతిక దూరం పాటించడంపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు, ప్రచారాన్ని అప్పటికే ప్రారంభించారని తెలిపింది. కరోనా నియంత్రణ చర్యలకు సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకునేందుకు మంత్రుల బృందాన్ని నియమించడం మరో విశేషమని పేర్కొంది.భారత్‌లో మొట్టమొదట వెయ్యి పడకల కరోనా దవాఖానను వారం రోజుల రికార్డు సమయంలో ఏర్పాటు చేయడంతోపాటు ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలతో కలిసి అన్ని జిల్లాల్లో 30 కరోనా ఆసుపత్రులను ఏర్పాటు చేసిన సబ్ రీజనల్ టీం లీడర్ డాక్టర్ నిహార్ రే కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత అధికారి నుంచి ప్రశంసలు పొందారని తెలిపింది.

పెద్ద వయస్కులు, దివ్యాంగులు, వితంతువులకు నాలుగు నెలల పెన్షన్ అడ్వాన్స్‌గా ఇచ్చారని, సీఎం నవీన్ పట్నాయక్ ఆరోగ్య కార్యకర్తల కోసం రూ.50 లక్షల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారని, స్వయం సహాయక బృందాలను ఆదుకున్నారని పేర్కొంది. ఇలాంటి ఎన్నో సమర్థవంతమైన చర్యల వల్ల జూన్ 28 నాటికి ఒడిశాలో కరోనా కేసులు, మరణాల రేటు జాతీయ, అంతర్జాతీయ గణాంకాలతో పొల్చితే చాలా తక్కువగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo