ఆదివారం 07 జూన్ 2020
National - Apr 01, 2020 , 23:12:06

ఎవ‌రీ మౌలానా సాద్‌ ?

ఎవ‌రీ మౌలానా సాద్‌ ?

హైద‌రాబాద్: మౌలానా సాద్ పూర్తి పేరు మౌలానా మొహ‌మ్మ‌ద్ సాద్ ఖంద‌ల్వి.  త‌బ్లిగీ జ‌మాత్ వ్య‌వ‌స్థాప‌కుడు మొహ‌మ్మ‌ద్ ఇలియాస్ ఖంద‌ల్వి మునిమ‌న‌వ‌డే మౌలానా సాద్‌. భార‌తీయ ఉప‌ఖండంలో సున్నీ ముస్లింలకు చెందిన అతిపెద్ద మ‌త సంస్థ ఇది. 1927లో మౌలానా ఇలియాస్ ఖంద‌ల్వి త‌బ్లిగీ జ‌మాత్‌ను స్టార్ట్ చేశారు.  యూపీలోని షామ్లీ జిల్లాలోని ఖాంద్లాలో ఇలియాస్ పుట్టారు. దాంటో ఆయ‌న పేరు చివ‌ర్లో ఖంద‌ల్వి పెట్టుకున్న‌ట్లు తెలుస్తోంది. 

మౌలానా ఇలియాస్ కుటుంబానికి చెందిన నాలుగ‌వ త‌రం వ్య‌క్తే మౌలానా సాద్‌. 1965లో ఢిల్లీలో ఆయ‌న జన్మించారు.  హ‌జ్ర‌త్ నిజాముద్దీన్‌లోని క‌ష్‌ఫుల్ ఉలూమ్ మ‌ద‌ర‌స‌లో ఆయ‌న చ‌దువుకున్నారు.  ష‌హ‌రాన్‌పూర్‌లో ఆయ‌న డిగ్రీ కూడా చేశారు. త‌బ్లిగీ జ‌మాత్ స‌ర్వేయ‌ర్ మౌలానా ఇనాముల్ హ‌స‌న్ 1995లో మ‌ర‌ణించారు. దాంతో ఆ సంస్థ‌కు తానే ఓన‌ర్‌ను అని మౌలానా సాద్ ప్ర‌క‌టించుకున్నారు.  ఆ త‌ర్వాత మ‌ర్క‌జ్ నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌లు ఆయ‌నే స్వీక‌రించారు. 

2017లో త‌బ్లిగీ జ‌మాత్‌లో వివాదం చెల‌రేగింది. ఆ సంస్థ‌లో చీలిక‌లు వ‌చ్చాయి.  రెండు వ‌ర్గాలుగా అది విడిపోయింది. అయితే పాత త‌బ్లిగీ జ‌మాత్ సంస్థ‌కు తానే అధిప‌తిని అని మౌలానా సాద్ ప్ర‌క‌టించుకున్నారు.  పాత సంస్థ నుంచి విడిపోయిన కొంద‌రు సుర క‌మిటీ పేరుతో  తుర్క్‌మ‌న్ గేటు వ‌ద్ద ఉన్న ఫ‌యిజ్ ఇలాహీ మ‌సీదులో త‌మ సంస్థ‌ను న‌డుపుకుంటున్నారు.  మౌలానా ఇబ్ర‌హీం, మౌలానా అహ్మ‌ద్ లాద్, మౌలానా జుహేర్ లాంటి గొప్ప ఇస్లామిక్ పండితులు ఫ‌యిజ్ ఇలాహీ వ‌ర్గంలో ఉన్నారు.

క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో ఫ‌యిజ్ ఇలాహీ సంస్థ త‌మ స‌మావేశాల‌ను ర‌ద్దు చేసింది.  కానీ త‌బ్లిగీ జ‌మాత్ పాత సంస్థ‌కు చెందిన మౌలానా సాద్ పిలుపు మేర‌కు జ‌రిగిన స‌మావేశానికి ముస్లింలు వేల సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు. ఆ స‌మావేశాల‌కు వ‌చ్చిన వారికి క‌రోనా వైర‌స్ సోకింది. ఇప్పుడు వాళ్లు దేశ‌మంతా విస్త‌రించ‌డంతో అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు వారిని వేటాడేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నం చేస్తున్నాయి.  
logo