మంగళవారం 14 జూలై 2020
National - Jun 17, 2020 , 01:47:56

స్నేహం.. కలహం..

స్నేహం.. కలహం..

 • తొలుత భారత్‌-చైనా మధ్య మంచి సంబంధాలు  
 • భారత్‌-చైనా భాయీ.. భాయీ.. అనే నినాదం 
 • డ్రాగన్‌ టిబెట్‌ ఆక్రమణతో జగడం ప్రారంభం 
 • దలైలామాకు ఆశ్రయం, సరిహద్దు వివాదాలతో యుద్ధం 
 • నాటి నుంచీ అప్పుడప్పుడూ ఘర్షణలు 

న్యూఢిల్లీ: ఒకరి భుజాలపై ఒకరు చేతులు వేసుకొని స్నేహమేరా జీవితం అని పాడుకొని.. తర్వాత కాలంలో ఒకరంటే ఒకరికి పడని శత్రువులుగా మారే స్నేహితుల కథతో అనేక సినిమాలు వచ్చాయి. భారత్‌-చైనా సంబంధాలు కూడా ఆ తరహాలోనే ఉన్నాయి. స్వాతంత్య్రానికి పూర్వం, ఆ తర్వాత కొంతకాలంపాటు ఇరుదేశాలు ఎంతో సఖ్యతగా మెలిగాయి. ‘హిందీ చీనీ భాయి.. భాయి’ అన్న నినాదం ప్రఖ్యాతినొందింది. కానీ, చైనా విస్తరణకాంక్ష ఈ స్నేహసంబంధాలను దెబ్బతీసింది.  

 • 1939: స్వాతంత్య్రం రాకముందు చైనాలో పర్యటించిన నెహ్రూ ఆ దేశంతో మైత్రిని కొనసాగించాలని ఆకాంక్షించారు. 
 • 1947: భారత్‌కు స్వాతంత్య్రం.
 • 1949: చైనాలో మావో జెడాంగ్‌ నేతృత్వంలోని పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా అధికారంలోకి వచ్చింది. భారత్‌-చైనా మధ్య మంచి సంబంధాలు ప్రారంభమయ్యాయి.
 • 1950: చైనా టిబెట్‌ను ఆక్రమించింది. దీనికి అభ్యంతరం వ్యక్తంచేస్తూ భారత్‌ చైనాకు ఓ లేఖను రాసింది. మరోవైపు, చైనాతో భారత్‌కు భవిష్యత్‌లో ప్రమాదం పొంచి ఉన్నదని అప్పటి ఉపప్రధాని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ హెచ్చరించారు. అయితే, నెహ్రూ ఈ మాటలను పట్టించుకోలేదు.
 • 1954: అప్పటి చైనా ప్రధాని చౌ ఎన్‌ లై భారత్‌లో, భారత ప్రధాని నెహ్రూ చైనాలో పర్యటించారు. భారత్‌-చైనా మధ్య పంచశీల ఒప్పందం కుదిరింది.
 • 1956: టిబెట్‌లో సంక్షోభ పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో చౌ ఎన్‌ లై మళ్లీ భారత్‌లో పర్యటించారు. 
 • 1958: టిబెట్‌ను సందర్శిస్తానన్న నెహ్రూకు చైనా అనుమతి నిరాకరణ. భారత భూభాగాలను తమవిగా చూపిస్తూ మ్యాపును విడుదల చేసిన చైనా. 
 • 1959: దలైలామాకు భారత్‌ ఆశ్రయం. 
 • 1961: ఇరు దేశాల మధ్య తెగిపోయిన దౌత్య సంబంధాలు
 • 1962: భారత్‌లోకి చొరబడ్డ చైనా. నెలపాటు యుద్ధం.
 • 1975: అరుణాచల్‌లో నలుగురు భారత సైనికులను అకారణంగా చంపిన చైనా దళాలు
 • 1998: భారత్‌ జరిపిన అణుపరీక్షలపై చైనా మండిపాటు, ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం
 • 2017: డోక్లాంలో రోడ్డు విస్తరణ పనులకు చైనా ప్రయత్నం. అడ్డుకున్న భారత్‌. డోక్లాం చైనాది కాదు.. తమదేనని పేర్కొన్న భూటాన్‌కు భారత్‌ మద్దతు.
 • 2020: గాల్వాన్‌లో బాహాబాహి.

ముఖ్య ఘటనలు 

 • 1954లో పంచశీల ఒప్పందం: భారత్‌, చైనా మధ్య ఈ ఒప్పందం కుదిరింది. దురాక్రమణకు పాల్పడకపోవడం, ఇరు దేశాల సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను పరస్పరం గౌరవించుకోవటం, దేశ అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం, సమానత్వం, ఉమ్మడి ప్రయోజనాలు, శాంతియుత జీవనం వంటి అంశాల్ని భారత్‌ పంచశీలలో ప్రతిపాదించింది. 
 • 1962లో భారత్‌-చైనా యుద్దం: టిబెట్‌ విషయమై చైనాకు భారత్‌ మద్దతునివ్వకపోవడం, ఇరు దేశాల మధ్య అప్పటికే నెలకొన్న సరిహద్దు వివాదాలు, దలైలామాకు భారత్‌ ఆశ్రయం కల్పించడం వంటి అంశాలు ఈ యుద్దానికి ప్రధాన కారణాలు.
 • 2017లో డోక్లాం వివాదం: డోక్లాం ప్రాంతం చైనా, భూటాన్‌ సరిహద్దుల్లో ఉంటుంది. ఈ ప్రాంతం మాది అంటే మాది అని ఇరు దేశాల వాదన. ఈ విషయంలో భారత్‌ భూటాన్‌కు మద్దతు తెలిపింది. ఈ ప్రాంతంలో చైనా ఓ రోడ్డును నిర్మిస్తున్నది. దీన్ని భారత బలగాలు అడ్డుకున్నాయి. దీంతో 2017లో ఉద్రిక్తత నెలకొన్నాయి.


logo