బుధవారం 25 నవంబర్ 2020
National - Oct 23, 2020 , 16:40:51

అన్నింటా విఫలమయ్యారు.. ఆర్టికల్‌ 370 రద్దుపైనే మాట్లాడుతున్నారు..

 అన్నింటా విఫలమయ్యారు.. ఆర్టికల్‌ 370 రద్దుపైనే మాట్లాడుతున్నారు..

శ్రీనగర్‌: వాస్తవ సమస్యల పరిష్కారంలో విఫలమైన సందర్భాల్లో కశ్మీర్‌, ఆర్టికల్‌ రద్దుపై ప్రధాని మోదీ మాట్లాడతారంటూ జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ విమర్శించారు. శుక్రవారం బీహార్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్టికల్‌ 360 రద్దు గురించి ప్రధాని మోదీ ప్రస్తావించడంపై ఆమె మండిపడ్డారు. ‘ఆర్టికల్‌ 370ని రద్దు చేశాం. జమ్ముకశ్మీర్‌లో భూములను మీరు కొనుగోలు చేయవచ్చు అని అంటున్నారు. వాస్తవానికి వెయ్యి చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించింది. ఎలాగోలా మనం 40 కిలోమీటర్ల భూమిని తిరిగి పొందాం. చైనా కూడా ఆర్టికల్‌ 370 రద్దుపై మాట్లాడుతున్నది. వివాదంలో ఉన్న జమ్ముకశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ఎందుకు చేశారని ప్రశ్నిస్తున్నది. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌ అంశం మరోసారి అంతర్జాతీయ దృష్టికి వచ్చింది’ అని వ్యాఖ్యానించారు.

దేశ సమస్యల సరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని మెహబూబా విమర్శించారు. నిరుద్యోగం లేదా ఇతర సమస్యలన్నింటిలో మోదీ ప్రభుత్వం విఫలమైందని ఆమె ఆరోపించారు. దేశ ఆర్థిక వ్యవస్థ బంగ్లాదేశ్ కన్నా వెనుక ఉన్నదని అన్నారు. అభివృద్ధిని చూపలేకపోవడంతో బీహార్‌ ఓటు బ్యాంకు కోసం వాస్తవ సమస్యలను వదిలేసి కశ్మీర్‌, ఆర్టికల్‌ 370 రద్దు, బీహార్‌ ప్రజలకు ఉచిత కరోనా టీకాల గురించి మోదీ మాట్లాడుతున్నారని మెహబూబా దుయ్యబట్టారు. ఆర్టికల్‌ 370 పునరుద్ధరణ గురించి ఆమె మాట్లాడుతూ.. దోచుకున్న వారు తిరిగి దానిని ఇవ్వాల్సిందే అని అన్నారు. ఇది తప్పక జరుగుతుందని నా ప్రజలకు భరోసా ఇస్తున్నా అని ముఫ్తీ తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.