శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 03, 2020 , 02:13:20

విస్తృత ధర్మాసనానికి నో!

విస్తృత ధర్మాసనానికి నో!
  • ఆర్టికల్‌ 370 రద్దు పిటిషన్లపై సుప్రీంకోర్టు నిర్ణయం

న్యూఢిల్లీ: ఆర్టికల్‌ 370 రద్దుపై దాఖలైన పిటిషన్లను ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తమకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదని జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. ఆర్టికల్‌ 370కి సంబంధించి ప్రేమ్‌నాథ్‌ కౌల్‌ వర్సెస్‌ జమ్ముకశ్మీర్‌ (1959), సంపత్‌ ప్రకాశ్‌ వర్సెస్‌ జమ్ముకశ్మీర్‌ (1970) కేసుల్లో సర్వోన్నత న్యాయస్థానం గతంలో వెలువరించిన తీర్పులు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని, ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలంటూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. పీపుల్స్‌ యూనియన్‌ ఆఫ్‌ సివిల్‌ లిబర్టీస్‌ (పీయూసీఎల్‌) అనే పౌరహక్కుల సంస్థతోపాటు జమ్ముకశ్మీర్‌ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఈ పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై విచారణ జరిపిన కోర్టు పిటిషనర్ల వాదనలతో ఏకీభవించలేదు. ఆ రెండు కేసుల్లో ఎలాంటి వైరుధ్యాలు లేవని అభిప్రాయపడిన ధర్మాసనం, ఆ పిటిషన్లను కొట్టివేసింది. 

logo