మంగళవారం 07 జూలై 2020
National - Mar 20, 2020 , 10:29:05

2012, డిసెంబర్ 16న రాత్రి ఏం జరిగింది?

2012, డిసెంబర్ 16న రాత్రి ఏం జరిగింది?

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్బయ కేసులో నలుగురు దోషులకు శుక్రవారం తెల్లవారుజామున 5:30 గంటలకు ఉరిశిక్ష అమలైంది. దోషులకు ఉరిశిక్ష అమలు కావడంతో నిర్భయ తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ బిడ్డకు ఏడేళ్లకు న్యాయం జరిగిందన్నారు. తీహార్ జైలు బయట ప్రజలు సంబురాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకున్నారు. నిర్భయ ఆత్మకు శాంతి చేకూరిందని పలువురు వ్యాఖ్యానించారు. మరి 2012, డిసెంబర్ 16న రాత్రి ఏం జరిగింది?

నిర్భయపై అత్యాచారం జరిగినప్పుడు ఆమె ఢిల్లీలోని ఓ కాలేజీలో ఫిజియోథెరపి కోర్సు చదువుతోంది. అంతే కాకుండా విద్యను అభ్యసిస్తూనే కాల్ సెంటర్ లో పని చేస్తుంది. డిసెంబర్ 16న రాత్రి 23 ఏళ్ల నిర్భయ తన స్నేహితుడితో కలిసి ఢిల్లీలోని సాకేత్ సెలెక్ట్ సిటీ వాక్ సినిమా హాల్ లో 'లైఫ్ ఆఫ్ పై' సినిమా చూడటానికి వెళ్లింది. సినిమా అయిపోయిన తర్వాత తిరిగి ద్వారకాలోని ఇల్లు చేరుకునేందుకు ఆటో కోసం ఎదురు చూస్తున్నారు నిర్భయ, ఆమె స్నేహితుడు. ద్వారక వెళ్లేందుకు ఒక్క వాహనం కూడా దొరకలేదు. మొత్తానికి ఒక ఆటోలో వారు మునీర్ కా బస్టాండ్ కు చేరుకున్నారు. అక్కడ కూడా ద్వారక వెళ్లేందుకు వాహనం దొరకలేదు. ఇంటికి ఎలా వెళ్లాలి అని ఆలోచిస్తున్న సమయంలో.. నిర్భయ, స్నేహితుడి ముందు ఓ బస్సు వచ్చి ఆగింది. ఆ బస్సులోనే రాక్షస మూక ఉన్నది. ద్వారక అనగానే ఆ బస్సులోకి నిర్భయ, ఆమె ఫ్రెండ్ ఎక్కారు. అయితే బస్సులో ఉన్న ఆ రాక్షస మూకను ప్రయాణికులని భావించారు. కానీ బస్సు కొంచెం కదలగానే వారు మానవ మృగాలు అని తెలుసుకున్నారు నిర్భయ, ఆమె స్నేహితుడు.

రాత్రి 9:30 గంటల సమయంలో బస్సులోనే ఆమెతో మైనర్ బాలుడితో పాటు మరో ఇద్దరు గొడవ పడ్డారు. సుమారు గంట పాటు ఘర్షణ జరిగిన తర్వాత ఆ మానవ మృగాలు నిర్భయపై విరుచుకుపడ్డాయి. బస్సు డ్రైవర్ రాంసింగ్ అతడి స్నేహితులు.. నిర్బయ ఫ్రెండ్ ను తీవ్రంగా చితకబాదారు. ఈ క్రమంలోనే నిర్భయపై వరుసగా అత్యాచారం చేశారు. నిర్భయ ప్రయివేటు భాగాల్లోకి ఇనుప రాడ్ ను చొప్పించి అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. ఆమెపై అత్యాచారం చేస్తూనే బస్సును ఢిల్లీ అంతటా తిప్పారు. ఈ హింసకాండ సుమారు గంటకు పైగానే కొనసాగింది. ఇద్దరూ స్పృహ కోల్పోయారు. ఆ తర్వాత నిర్భయ, ఆమె స్నేహితుడు చనిపోయారని భావించి.. వారిద్దరిని రోడ్డు పక్కన తోసేసి వెళ్లిపోయింది రాక్షస మూక. ఇక ఇద్దరి వద్ద ఉన్న మొబైల్ ఫోన్, పర్స్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులు లాక్కున్నారు.  

ఎవరో నిర్భయను చూసి ఆమెను చికిత్స నిమిత్తం ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. రాత్రి 11:15 గంటలకు నిర్భయ తండ్రికి ఫోన్ కాల్ వచ్చింది. తల్లిదండ్రులు ఆస్పత్రికి వెళ్లి చూడగా.. నిర్భయ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఇంతటి భయంకరమైన సామూహిక అత్యాచారం కేసును ఎప్పుడూ చూడలేదని డాక్టర్లు కూడా చెప్పారు. తర్వాత రెండు వారాల వరకూ నిర్భయ మృత్యువుతో పోరాడింది. కానీ ఆమె శరీరమంతా తగిలిన గాయాలు, పేవులు పూర్తిగా బయటకు లాగేయడంతో ఆమె కోలుకునే అవకాశాలు అంతకంతకూ క్షీణించాయి. ఆమె స్నేహితుడిని మాత్రం ప్రాథమిక చికిత్స తర్వాత డిశ్చార్జ్ చేశారు.

నిర్భయ పరిస్థితి క్షీణించడం చూసిన అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ డిసెంబర్ 27న ఆమెను ఎయిర్ అంబులెన్స్‌లో సింగపూర్ పంపించాలనే నిర్ణయం తీసుకున్నారు. తర్వాత ఒక్కరోజుకే, అంటే డిసెంబర్ 29న ఉదయం నిర్భయ సింగపూర్ ఆస్పత్రిలో మృతిచెందింది. 


logo