ఆదివారం 05 జూలై 2020
National - Jun 17, 2020 , 18:23:30

1967 చైనా ఘర్షణలో ఏం జరిగిందో తెలుసా?

1967 చైనా ఘర్షణలో ఏం జరిగిందో తెలుసా?

న్యూఢిల్లీ: భారత్‌, చైనా సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికుల మధ్య చాలా సార్లు ఘర్షణలు జరిగినప్పటికీ ప్రధానంగా చెప్పుకునేది 1967 నాటి ఘర్షణే. సుమారు 44 ఏండ్ల తర్వాత మంగళవారం లఢక్‌లోని గాల్వన్‌ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య అంతటి పెద్ద ఘర్షణ జరగడంతో అసలు నాడు ఏం జరిగిందన్నదానిపై అందరిలో ఉత్కంఠ నెలకొన్నది.

1967 ఆగస్టు 20:  సిక్కిం సరిహద్దులోని  నాథూ లా వద్ద భారత సైనికులు ఫెన్సింగ్‌ ఏర్పాటు పనులు ప్రారంభించారు. ఆగస్టు 23న సుమారు 75 మంది చైనా సైనికులు తుపాకులతో నాథూ లా సమీపానికి వచ్చి గట్టిగా నినాదాలు చేస్తూ అభ్యంతరం వ్యక్తం చేశారు. గంట తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయారు. మళ్లీ తిరిగి వచ్చి తమ నిరసన కొనసాగించారు.

సెప్టెంబర్‌ 5: ఫెన్సింగ్ వైర్‌ సరిచేస్తుండగా నాటి కమాండింగ్‌ ఆఫీసర్‌ లెప్టనెంట్‌ కర్నల్‌ రాయ్‌ సింగ్‌తో చైనా సైనిక అధికారి వాదానికి దిగారు. దీంతో ఆ పనిని నిలిపివేశారు.

సెప్టెంబర్ 7: రెండు రోజులకు తిరిగి ఫెన్సింగ్‌ పని ప్రారంభించగా సుమారు వంద మంది చైనా సైనికులు ముందుకు దూసుకొచ్చారు. దీంతో ఇరు సైనికుల మధ్య ఘర్షణ, తోపులాట జరిగింది. అనంతరం చైనా సైనికులు రాళ్ల దాడికి దిగారు. భారత జవాన్లు కూడా దీటుగా ప్రతిఘటించారు. 

భారత రాయబారికి హెచ్చరిక

ఈ పరిణామాల నేపథ్యంలో సెప్టెంబర్‌ 10న చైనాలోని భారత రాయబారికి ఆ దేశం తీవ్ర హెచ్చరిక చేసింది. సరిహద్దులో జరిగే పరిణామాలకు భారత్‌ బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది. కాగా సెప్టెంబర్‌ 11న ఫెన్సింగ్ పని పూర్తి చేయాలని కార్స్‌ కమాండర్‌ ఆదేశించారు. ఆ రోజు ఆ పని జరుగుతుండగా చైనా సైనికులు వచ్చి నిరసన తెలిపారు. అయితే చైనా కమాండర్‌తో మాట్లాడేందుకు లెఫ్టనెంట్‌ కర్నల్‌ రాయ్‌ సింగ్‌ ముందుకు వెళ్లారు. ఇంతలో చైనా సైనికులు ఆయనపై కాల్పులు జరపగా ఆయన కిందపడి గాయపడ్డారు. ఇది చూసిన భారత జవాన్లు చైనా పోస్టుపై విరుచుకుపడ్డారు. చైనా కూడా మెషిన్‌ గన్లతో బదులిచ్చింది. భారత్‌ కూడా మరింతగా కాల్పులు జరిపింది. ఇరువైపుల జరిగిన కాల్పుల్లో 88 మంది భారత సైనికులు అమరులుకాగా 300 మందికిపైగా చైనా సైనికులు మరణించారు. 

కంగుతిన్న చైనా

 భారత్‌ దాడికి కంగుతున్న చైనా యుద్ద విమానాలను దించుతామని హెచ్చరించింది. అయితే ఏ మాత్రం వెనక్కి తగ్గని భారత్‌, సెప్టెంబర్‌ 12న చైనాకు ఓ సందేశం పంపింది. మరుసటి రోజు నుంచి బేషరతుగా కాల్పుల విరమణ పాటిస్తామని పేర్కొంది. ఈ ప్రాతిపాదనను చైనా తిరస్కరించింది. అయితే 14వ తేదీ వరకు ఇరువైపులా ఎలాంటి కాల్సులు జరుగలేదు. సెప్టెంబర్‌ 15న భారత సైనికుల మృతదేహాలను ఆయుధాలతో సహా చైనా అప్పగించింది. ఇరు దేశాల మధ్య స్నేహానికి కట్టుబడి ఉన్నట్లు చైనా పేర్కొంది. దీంతో ఈ ఘర్షణ ముగిసింది.

44 ఏళ్లకు మళ్లీ..

అయితే అక్టోబర్‌ 1న చోలాలో ఇరు దేశాల సైనికుల మధ్య మరోసారి ఘర్షణ జరిగింది. ఈసారి కూడా భారత జవాన్లు చైనా సైనికులను తిప్పికొట్టారు. అనంతరం అప్పుడప్పుడు ఇరు దేశాల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. అయితే సుమారు 44 ఏండ్ల తర్వాత మంగళవారం లఢక్‌లోని గాల్వన్‌ లోయలో భారత్‌, చైనా సైనికుల మధ్య జరిగిన అంతటి ఘర్షణలో కాల్సులు జరుగకుండానే 20 మంది భారత సైనికులు అమరులయ్యారు.  చైనా వైపు కూడా 40 మందికిపైగా సైనికులు మరణించి ఉంటారని తెలుస్తున్నది. logo