ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 13, 2020 , 15:23:19

బంగారం ధరలు తగ్గడానికి గల కారణాలు ?

బంగారం ధరలు తగ్గడానికి గల కారణాలు ?

ముంబై : బంగారం ధరలు తగ్గడానికి గల ఆసక్తరమైన కారణాలు చాలానే ఉన్నాయి . ముఖ్యంగా నాలుగు రోజులక్రితం వరకు దూసుకెళ్లిన బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. నిన్నటి వరకు మూడు రోజుల్లో రూ.4,000 నుంచి  రూ.5,000 తగ్గింది. కరోనాకు వ్యాక్సీన్ అందుబాటులోకి రావడంతో బంగారం ధరలు దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుముఖం పట్టడంతో ఆ ప్రభావం భారత పసిడి మార్కెట్ పైన పడింది. రూ.40వేల కంటే తక్కువగా ఉన్న  పసిడి ధర రూ.60వేల సమీపానికి చేరుకున్నది. ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నది. దేశీయ మార్కెట్ న్యూఢిల్లీలో గత శుక్రవారం అంటే ఆగస్టు 7న 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రికార్డ్ స్థాయిలో రూ.57,000 పైకి చేరుకుంది. 

అలాంటిది బుధవారం నాటికి రూ.52,300 దిగువకు వచ్చింది. అంటే ఏకంగా రూ.4,000కు పైగా తగ్గింది. ఎంసీఎక్స్‌లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న రూ.1500 (3 శాతం) తగ్గి రూ.50,441 పలికింది. వెండి ఫ్యూచర్స్ 5 శాతం లేదా రూ.5000 పడిపోయింది. మొన్నటి సెషన్‌లో బంగారం రూ.3200 తగ్గింది. వెండి కిలో రూ.9000 పడిపోయింది.  అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు భారీగా తగ్గాయి. గత శుక్రవారం ఔన్స్ ధర రికార్డ్‌స్థాయి 2078 డావలర్లకు చేరుకుంది. తొమ్మిదేండ్ల గరిష్టాన్ని అధిగమించింది. జూలై 27న రికార్డులు బ్రేక్ చేసింది. ఆ తర్వాత పదిపదిహేను రోజుల్లో బంగారం ధర దారుణంగా పతనమైంది.  

వ్యాక్సీన్ వచ్చిందని తెలియడంతో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించేందుకు మొగ్గు చూపారు. శుక్రవారం నుంచి పసిడి పెట్టుబడుల ఉపసంహరణ ప్రారంభమైంది.దీంతో ధరలు అమాంతం పడిపోతున్నాయని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. బుధవారం రాత్రి సమయానికి అంతర్జాతీయ మార్కెట్లో గరిష్టం 2,078 డాలర్ల నుంచి 130 డాలర్లకు పైగా తగ్గి 1,947కు పైగా ట్రేడ్ అయింది. ఓ దశలో 200 డాలర్లు పడిపోయి ఏకంగా 1,876 డాలర్లు చూసింది. అయితే ఈ స్థాయిని చూసిన కేవలం కొద్ది గంటల్లోనే ధర కాస్త పుంజుకున్నది. కీలక నిరోధ స్థాయి 1,911 డాలర్లని దాటింది. మొత్తంగా బంగారం 1,950 డాలర్లకు అటు ఇటుగా ఉంది.

అంతర్జాతీయ పరిణామాలకు రష్యా వ్యాక్సీన్ శుభవార్త తోడు కావడంతో బంగారం ధరలు అంతర్జాతీయంగా దారుణంగా పతనమయ్యాయి. దీంతో మంగళవారం బంగారం ధరలు ఏకంగా 4.3 శాతం క్షీణించగా, వెండి 7.2 శాతం తగ్గిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న సూచనలు, కరోనా మహమ్మారి ప్యాకేజీలు, ఈక్విటీ మార్కెట్లు పుంజుకోవడం, ప్రధానంగా వ్యాక్సీన్ గుడ్‌న్యూస్‌తో బంగారంపై ఒత్తిడి లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది లాభాలు స్వీకరించేందుకు మొగ్గు చూపారు.


logo