రైతుల అంశాలన్నింటినీ పరిశీలిస్తాం: తోమర్

న్యూఢిల్లీ: రైతులకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలిస్తామని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. రైతు నేతల నుంచి సలహాలు అందితే పరిష్కరించడం తమకు సులువు అవుతుందన్నారు. రైతు సంఘాల నేతలు, ప్రతినిధులతో శనివారం జరిగిన ఐదో విడత చర్చలు అంపూర్తిగా ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కనీస మద్దతు ధరను కొనసాగిస్తామని, దానికి ఎలాంటి ముప్పు లేదన్నారు. దీనిపై అనుమానాలు వ్యక్తం చేయడం సరికాదన్నారు. ఇంకా అనుమానాలు ఉంటే తీర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. రాష్ట్రాల్లో మండీలను ప్రభావితం చేసే ఉద్దేశం లేదని తెలిపారు. వ్యవసాయ చట్టాల వల్ల వాటిపై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు. ఏపీఎంసీని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తోమర్ అన్నారు. దీనిపై ఎలాంటి అనుమానాలు ఉన్నా తీరుస్తామని చెప్పారు. రైతు సంఘాలు 8న పిలుపునిచ్చిన భారత్ బంద్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని తోమర్ అన్నారు. అయితే ఆందోళన బాట వీడి చర్చలకు రావాలని కోరారు. ఇప్పటికే ప్రభుత్వం రైతు ప్రతినిధులతో పలు దఫాలుగా చర్చలు జరిపిందని, పరిష్కారం కోసం ఇంకా చర్చలు జరుపుతామని అన్నారు.
రైతు సమస్యల పరిష్కారానికి మోదీ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, భవిష్యత్తులోనూ అలాగే ఉంటుందని తోమర్ తెలిపారు. ఎన్నో వ్యవసాయ పథకాలు ప్రవేశపెట్టామని, బడ్జెట్‌తోపాటు కనీస మద్దతు ధరను పెంచామని వివరించారు. మోదీ ప్రభుత్వం ఏది చేసినా రైతుల ప్రయోజనం కోసమేనన్న నమ్మకం కలిగి ఉండాలని కోరారు. క్రమశిక్షణ పాటిస్తున్న రైతు సంఘాలకు తోమర్ ధన్యవాదాలు తెలిపారు. చర్చలు పూర్తిగా ముగియకపోవడంతో ఈ నెల 9న మరో భేటీ ఉంటుందని చెప్పారు. చలి తీవ్రత నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులను ఇండ్లకు పంపాలని రైతు సంఘాలకు విన్నవించారు. చలి వాతావరణంలో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు, ఢిల్లీ ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా ఉండేందుకు కదలికలను వీడాలని రైతులను కోరారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి