బుధవారం 15 జూలై 2020
National - Jul 01, 2020 , 13:25:28

టీ తాగేందుకు వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై దాడి

టీ తాగేందుకు వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై దాడి

కోల్‌కతా: తనపై దాడి జరిగినట్లు పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఆరోపించారు. బుధవారం ఉదయం ఉత్తర 24 పరగణాలులోని ఓ టీస్టాల్‌ వద్దకు టీ తాగేందుకు వెళ్లగా అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) పార్టీకి చెందిన కార్యకర్తలు తనపై దాడి చేసినట్లు ఆయన చెప్పారు. తనను కాపాడబోయిన సెక్యూరిటీ గార్డులను టీఎంసీ కార్యకర్తలు కొట్టారని, తన కారును స్వల్పంగా ధ్వంసం చేశారని ఆరోపించారు. టీఎంసీ సమస్య ఏమిటన్నది తనకు అర్థం కావడంలేదని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ వ్యాఖ్యానించారు. 

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. గత ఎన్నికల్లో భంగపాటుకు గురైన బీజేపీ ఈసారి ఎలాగైనా రాష్ట్రంలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ధీమాతో ఉన్నది. మరోవైపు రెండు సార్లు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ కూడా రాష్ట్రంలో తన పట్టు కోల్పోకుండా ప్రయత్నిస్తున్నారు. మూడోసారి కూడా ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్‌ సీఎం కావాలన్న పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తరచుగా ఘర్షణలు జరుగుతున్నాయి. కరోనా నియంత్రణలో సీఎం మమత విఫలమయ్యారని బీజేపీ రాష్ట్ర నేతలు ఆరోపిస్తుండగా, అధికార టీఎంసీ నేతలు వాటిని తిప్పికొడుతున్నారు. logo