గురువారం 29 అక్టోబర్ 2020
National - Sep 28, 2020 , 15:19:33

సుశాంత్ కేసులో సీబీఐ దర్యాప్తు ఫలితాల కోసం చూస్తున్నాం..

సుశాంత్ కేసులో సీబీఐ దర్యాప్తు ఫలితాల కోసం చూస్తున్నాం..

ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో సీబీఐ దర్యాప్తు ఫలితాల గురించి ఆసక్తితో ఎదురుచూస్తున్నామని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తెలిపారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారా లేక హత్యకు గురయ్యారా అని ప్రజలు తమను అడుగుతున్నారని చెప్పారు. సుశాంత్ మరణం కేసును ముంబై పోలీసులు ప్రోఫెషనల్‌గానే దర్యాప్తు చేశారని అనిల్ దేశ్‌ముఖ్ అన్నారు. అయితే ఈ కేసు దర్యాప్తును ఆకస్మాత్తుగా సీబీఐకి అప్పగించారని చెప్పారు. సీబీఐ దర్యాప్తు ప్రారంభించి నెలన్నర రోజులైనా కేసు పురోగతి ఏమిటన్నది తెలియడం లేదన్నారు.

మరోవైపు సుశాంత్ కేసులో సీబీఐ ఏమీ గుర్తించకపోవడంతోనే మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్సీబీ) వరుసగా బాలీవుడ్ తారలను పిలిపించి ప్రశ్నిస్తున్నదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇటీవల విమర్శించారు. డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టడం ఆ సంస్థ పని అని, దానికి బదులుగా బాలీవుడ్ తారలను వరుసగా ప్రశ్నిస్తున్నదని ఆయన ఆరోపించారు. కాగా, సీబీఐ దర్యాప్తుపై సుశాంత్ సింగ్ తండ్రి తరుఫు న్యాయవాది కూడా ఇటీవల పెదవి విరిచారు. దర్యాప్తు డ్రగ్స్ వైపు మళ్లినట్లుగా సుశాంత్ తల్లిదండ్రులు భావిస్తున్నారని ఆయన అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.