బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 19:54:40

భారత్‌లో సేవలకు వుయ్‌ చాట్‌ స్వస్తి!

భారత్‌లో సేవలకు వుయ్‌ చాట్‌ స్వస్తి!

న్యూ ఢిల్లీ: భారత్‌లో నిషేధానికి గురైన చైనా మెసేజింగ్‌ యాప్‌ వుయ్‌ చాట్‌ ఇక్కడ వినియోగదారులకు తన సేవలను అధికారికంగా నిలిపివేసింది. చాలామంది వినియోగదారులు ఈ యాప్‌ నుంచి ఆటోమేటిక్‌గా లాగ్‌అవుట్‌ అయ్యారు. ఈ సమస్యను వారు ట్విట్టర్‌లో పెట్టారు. 

ఈ మేరకు వుయ్‌ చాట్‌ కూడా తన వినియోగదారులకు ఒక నోటిఫికేషన్‌ పంపింది. ‘భారతీయ చట్టానికి అనుగుణంగా మేం ఈ సమయంలో మీకు సేవలను అందించలేకపోతున్నాం. మా ప్రతి వినియోగదారుడికీ విలువనిస్తాం. డేటా భద్రత, ప్రైవసీ మాకు చాలా ముఖ్యమైనవి. సంబంధిత అధికారులతో టచ్‌లో ఉన్నాం. భవిష్యత్తులో సేవలను తిరిగి ప్రారంభించగలమని ఆశిస్తున్నాం.’ అని పేర్కొంది. ఇదిలా ఉండగా, ఇండియాలో వుయ్‌ చాట్‌ సేవలను నిలిపివేయడం ఇక్కడ నివసిస్తున్న చైనా పౌరులను ప్రభావితం చేయనుంది. టిక్‌టాక్‌, ఇతర యాప్‌ల నిషేధం వల్ల తమకు ఇబ్బంది కలుగలేదు కానీ, వుయ్‌ చాట్‌ నిషేధంతో  తమ సామాజిక, వృత్తిపరమైన సమాచార మార్పిడికి ఆటంకం కలుగుతున్నదని ఓ చైనీయుడు తెలిపాడు.  

దేశంలో 59 యాప్‌లను నిషేధించిన దాదాపు నెల తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ 47 చైనీస్ యాప్‌లను బ్యాన్‌ చేస్తున్నట్లు సోమవారం ఉదయం ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిలో టిక్‌టాక్ లైట్, హెలో లైట్, షేర్‌ఇట్ లైట్, బిగో లైట్, వీఎఫ్‌వై లైట్ ఉన్నాయి. వీటిని గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్లనుంచి తొలగించారు. ఇంకా కొన్ని తొలగించనున్న యాప్‌ల జాబితాను కూడా త్వరలో విడుదల చేయనున్నారు. ఇందులో పబ్జీ గేమ్‌ కూడా ఉండనుందని సమాచారం.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo