ఆదివారం 06 డిసెంబర్ 2020
National - Nov 08, 2020 , 15:31:12

ఉప ఎన్నికల్లో 28 స్థానాలు మావే : వీడీ శర్మ

ఉప ఎన్నికల్లో  28 స్థానాలు మావే : వీడీ శర్మ

భోపాల్‌ :  మధ్యప్రదేశ్‌లో  ఉప ఎన్నికలు జరిగిన 28 స్థానాల్లో  బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికలపై శనివారం రాత్రి  బీజేపీ ప్రధాన కార్యాలయంలో  నిర్వహించిన సమీక్ష సమావేశానికి సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌తో కలిసి ఆయన హాజరై మాట్లాడారు.  మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నాయకుడు కమల్‌నాథ్‌కు బీజేపీ బూ‌త్‌ లెవల్‌ కార్యకర్తలు తగిన సమాధానం చెప్పారని అన్నారు. సమీక్ష సమావేశం తరువాత ఉప ఎన్నికలు జరిగిన 28 చోట్ల తామే విజయం సాధించబోతున్నట్లు స్పష్టమైందని అన్నారు. 

ఎన్నికల తరువాత ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలో సమావేశంలో కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసినట్లు చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అన్నారు.  పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన మాజీ మంత్రి గౌరీశంకర్‌ షెజ్వార్‌తో సహా పలువురు నాయకులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు శర్మ తెలిపారు.  మంగళవారం మధ్యప్రదేశ్‌లో 28 స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా 69.93 పోలింగ్‌ శాతం నమోదైంది.  ఈ నెల 10న ఫలితాలు వెల్లడికానున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.