శుక్రవారం 23 అక్టోబర్ 2020
National - Oct 18, 2020 , 01:05:10

వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తాం

వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తాం

  • రాష్ట్రంలో అమలుచేయం
  • ఎన్నికల మ్యానిఫెస్టోలో మహాకూటమి హామీ

పాట్నా, అక్టోబర్‌ 17: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్జేడీ) నేతృత్వంలోని విపక్ష మహాకూటమి శనివారం  మ్యానిఫెస్టోను విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే 10 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రాష్ట్రంలో అమలు కాకుండా రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. మహాకూటమి నేతల సమక్షంలో ఆర్జేడీ నేత తేజస్వియాదవ్‌ ఈ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. తాము అధికారంలోకి రాగానే 10 లక్షల ఉద్యోగాల నియామక ప్రక్రియకే తొలుత ఆమోదం తెలుపుతామని ప్రకటించారు. ఒకే పనికి ఒకేరకమైన వేతనం చెల్లించాలని ఎన్నో ఏండ్లుగా నిరసన చేపడుతున్న ఒప్పంద ఉపాధ్యాయుల డిమాండ్‌ను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. పోటీ పరీక్షల ఫీజులను రద్దు చేస్తామని, వలస కార్మికుల కోసం హెల్ప్‌లైన్‌ను ఏర్పాటుచేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా అధికార పక్షంపై తేజస్వి విమర్శలు గుప్పించారు. రాష్ర్టానికి ప్రత్యేక హోదా సాధించడంలో నితీశ్‌కుమార్‌ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఇస్తామని గతంలో హామీ ఇచ్చిన ప్రధాని మోదీ.. ఇప్పటికీ దాన్ని నెరవేర్చలేదని ఆరోపించారు. ‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వచ్చి బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వరు’ అంటూ మోదీని ఎద్దేవా చేశారు. 


logo