బుధవారం 02 డిసెంబర్ 2020
National - Nov 06, 2020 , 11:52:52

భార‌త్‌పై సోష‌ల్ మీడియాలో పాక్ దుష్ర్ప‌చారాలు : రావ‌త్‌

భార‌త్‌పై సోష‌ల్ మీడియాలో పాక్ దుష్ర్ప‌చారాలు :  రావ‌త్‌

హైద‌రాబాద్‌: ప్ర‌పంచ‌వ్యాప్తంగా భార‌త్ ఇమేజ్ పెరుగుతున్న నేప‌థ్యంలో.. స‌మాంత‌రంగా దేశానికి భ‌ద్ర‌తా స‌వాళ్లు కూడా ఎదుర‌వుతుంటాయ‌ని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ తెలిపారు.  నేష‌న‌ల్ డిఫెన్స్ కాలేజీ  ఏర్పాటు చేసిన వెబినార్‌లో ఆయ‌న మాట్లాడారు. నిరంత‌ర బెదిరింపుల నుంచి దేశం బ‌య‌ట‌ప‌డాల‌ని,  దానికి త‌గిన‌ట్లు సైనిక అవ‌స‌రాల‌ను తీర్చుకోవాల‌న్నారు.  దేశీయంగా వ్యూహాత్మ‌క సామ‌ర్థ్యాన్ని పెంచుకోవాల‌న్నారు. ఎదుర‌వుతున్న స‌వాళ్ల‌ను అధిగ‌మించేందుకు.. సైనిక శ‌క్తిని మ‌రింత చురుగ్గా త‌యారు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని రావ‌త్ అన్నారు. ఇస్లామిక్ ఆయుధ తీవ్ర‌వాదానికి పాకిస్థాన్ ఇంకా కేంద్రంగానే ఉంద‌ని, మూడు ద‌శాబ్ధాలుగా ఆ దేశంలో ఉగ్ర‌వాదం కూడా ఉంద‌న్నారు.  పాకిస్థాన్‌తో పాటు ఆ దేశ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ కూడా  జ‌మ్మూక‌శ్మీర్‌లో ప‌రోక్ష యుద్ధాన్ని కొన‌సాగిస్తున్నాయ‌ని ఆరోపించారు. సోష‌ల్ మీడియాలో భార‌త్‌పై ఆ దేశం దుష్ర్ప‌చారం చేస్తోంద‌న్నారు.  సామాజిక సామ‌ర‌స్యాన్ని దెబ్బ‌తీసేందుకు మ‌త‌ప‌ర‌మైన త‌ప్పుడు ప్ర‌చారాలు పాక్ చేస్తున్న‌ద‌‌ని బిపిన్ రావ‌త్ అన్నారు. 

దేశ స‌రిహ‌ద్దుల్లో చెల‌రేగుతున్న వివాదాలు, సైనిక చ‌ర్య‌లు పెద్ద‌గా మారుతున్నాయ‌ని, వాటిని విస్మ‌రించ‌లేమ‌ని ఆయ‌న అన్నారు. ల‌డాఖ్‌లో చైనా సైనికుల ఆక్ర‌మ‌ణ‌ను ఉద్దేశిస్తూ ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. తూర్పు ల‌డాఖ్‌లోని భార‌త్‌, చైనా మ‌ధ్య ఉన్న వాస్త‌వాధీన రేఖ వెంట ప‌రిస్థితి ఉద్రిక్తంగానే ఉంద‌ని ఆయ‌న అన్నారు. స‌రిహ‌ద్దు వెంట భార‌తీయ సైనిక ద‌ళాలు అప్ర‌మ‌త్తంగా ఉండ‌డం వ‌ల్లు.. చైనాకు చెందిన పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీ అనూహ్య‌మైన ప‌రిణామాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తున్న‌ద‌ని రావ‌త్ అన్నారు. ఎల్ఈసీలో ఎటువంటి మార్పును అంగీక‌రించేదిలేద‌న్నారు.