ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 02:59:40

ప్రధాని ఇంటిముందూ ధర్నా!

ప్రధాని ఇంటిముందూ ధర్నా!

  • అవసరమైతే అందరం రాష్ట్రతిని కలుద్దాం
  • ఎమ్మెల్యేలకు రాజస్థాన్‌ సీఎం పిలుపు

జైపూర్‌, జూలై 25: తన ప్రభుత్వాన్ని కాపాడుకొనేందుకు ఎంతదూరమైనా వెళ్లేందుకు సిద్ధమని రాజస్థాన్‌ సీఎం అశోక్‌గెహ్లాట్‌ ప్రకటించారు. అవసరమైతే రాష్ట్రపతి ముందు ఎమ్మెల్యేలంతా పరేడ్‌ నిర్వహించి, ప్రధాని ఇంటి ముందు ధర్నా చేసేందుకు సిద్ధంగా ఉండాలని తన వర్గం ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. శనివారం నిర్వహించిన కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశంలో గెహ్లాట్‌ మాట్లాడారు. రాజకీయ సంక్షోభం ఇప్పటికిప్పుడే సమసిపోయే అవకాశం లేదని, ఎమ్మెల్యేలంతా మరికొద్దిరోజులు ఫెయిర్‌మౌంట్‌ హోటల్లోనే ఉండాల్సి రావచ్చని సూచించారు. అసెంబ్లీని తక్షణం సమావేశపర్చాలని డిమాండ్‌చేస్తూ సీఎం ఆధ్వర్యంలో ఆయన వర్గం ఎమ్మెల్యేలంతా శుక్రవారం రాజ్‌భవన్‌లో ధర్నా చేసిన విషయం తెలిసిందే.

క్యాబినెట్‌ తాజా నోట్‌

అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు గెహ్లాట్‌ మంత్రిమండలి పంపిన నోట్‌పై గవర్నర్‌ కల్‌రాజ్‌మిశ్రా ప్రశ్నలు లేవనెత్తటంతో శనివారం మరో నోట్‌ను ప్రభుత్వం గవర్నర్‌కు అందజేసింది. శనివారం సీఎం నివాసంలో సమావేశమైన క్యాబినెట్‌ తాజాగా మరో తీర్మానాన్ని ఆమోదించి గవర్నర్‌కు పంపింది. ఈ నెల 31న అసెంబ్లీని సమావేశపర్చాలని కోరింది. మరోవైపు ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. రాజధాని జైపూర్‌లో యువజన కాంగ్రెస్‌ భారీ సభ నిర్వహించింది. కుట్రలతో ప్రతిపక్షాల ప్రభుత్వాలను కూలదోస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసన చేపడుతామని కాంగ్రెస్‌ నేత కేసీ వేణుగోపాల్‌ ప్రకటించారు. కాగా, గవర్నర్‌కు హెచ్చరికలు జారీచేసిన సీఎం గెహ్లాట్‌, హోంమంత్రిని ఐపీసీ సెక్షన్‌ 124 ప్రకారం అరెస్టు చేయాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్‌ చేసింది. గవర్నర్‌ను శనివారం కలిసిన బీజేపీ నేతలు వినపతి పత్రం సమర్పించారు.  


logo