సోమవారం 30 నవంబర్ 2020
National - Nov 13, 2020 , 18:44:57

ప‌ది రోజుల్లో ప‌రిస్థితిని అదుపులోకి తెస్తాం: ‌కేజ్రివాల్‌

ప‌ది రోజుల్లో ప‌రిస్థితిని అదుపులోకి తెస్తాం: ‌కేజ్రివాల్‌

న్యూఢిల్లీ: ఢిల్లీలో గ‌త కొన్ని రోజులుగా కరోనా వైరస్ మ‌ళ్లీ విజృంభిస్తుండ‌టంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ విచారం వ్యక్తంచేశారు. వాయు కాలుష్యమే ప్రస్తుత పరిస్థితికి కారణమని, వారం, పది రోజుల్లో పరిస్థితిని అదుపులోకి తీసుకువస్తామని ఆయ‌న ఆశాభావం వ్యక్తంచేశారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడిన కేజ్రివాల్‌.. 'దిల్లీలో కొవిడ్‌-19 విజృంభణ ప్రమాదకరంగా ఉంది. మా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్న‌ది. వారం, పది రోజుల్లో కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుంద‌ని, పరిస్థితి అదుపులోకి వస్తుందని ఆశిస్తున్నా' అని పేర్కొన్నారు. 

క‌రోనా వైరస్ పెరుగుదలకు ప్రధాన కారణం వాయు కాలుష్యమ‌ని, ఢిల్లీలో మహమ్మారిని అదుపులో ఉంచగలిగినా, కాలుష్యం కారణంగా మళ్లీ వైరస్ విజృంభిస్తున్న‌దని, అందుకే కేసులు పెరుగుతున్నాయ‌ని కేజ్రీవాల్ తెలిపారు. పంట వ్యర్థాల దహనం కారణంగా గత 10-12 ఏండ్లుగా ఢిల్లీతోపాటు ఉత్తర భారతదేశమంతా కాలుష్యం పెరిగిపోయిందని కేజ్రీవాల్‌ ఆందోళన వ్యక్తంచేశారు. 

కాగా, ఒక‌వైపు చలి తీవ్ర‌త పెరుగ‌డం, మ‌రోవైపు పెరిగిన‌ కాలుష్యం కార‌ణంగా ఢిల్లీలో నిన్న ఒక్కరోజే 7,053 కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో కేసులు సంఖ్య 4.67 లక్షలు దాటింది. 104 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు 89 శాతం మంది వైరస్ నుంచి కోలుకోగా, ప్ర‌స్తుతం మొత్తం 43,116 యాక్టివ్‌ కేసులున్నట్లు అధికారులు వెల్లడించారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.