సోమవారం 26 అక్టోబర్ 2020
National - Sep 22, 2020 , 21:20:14

హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తాం : ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి

హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తాం : ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి

న్యూఢిల్లీ: ప్రైవేట్ హాస్పిటల్స్‌లోని ఐసీయూలలో 80శాతం పడకలను కోవిడ్ రోగులకు రిజర్వ్ చేయాలన్న ఆప్ సర్కార్ ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది. ఉన్నత న్యాయస్థానం తాజా ఉత్తర్వులతో సర్కార్ ఆదేశాలు నిలిచిపోయాయి. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు స్టే కొనసాగుతుందని హైకోర్టు పేర్కొంది. మరోసారి తాము వాదనలు వినేంత వరకు ప్రభుత్వం తమ ఆదేశాలను కొనసాగించొద్దని కోర్టు స్పష్టం చేసింది. అయితే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఢిల్లీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్టు తీర్పును తాము సవాల్ చేస్తామని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. కరోనాపై మరింత ఉధృత పోరాటం చేయాలంటే ప్రస్తుతం తాము తీసుకున్న నిర్ణయాలు అమలు కావాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని 28 ప్రైవేట్ హాస్పిటల్‌ యాజమాన్యాలకు ఢిల్లీ ప్రభుత్వం 80శాతం పడకలను కరోనా రోగులకు కేటాయించాలని ఆదేశాల్లో పేర్కొంది. ఐసీయూ పడకలు కొరత ఉండడతో నిర్ణయం తీసుకుంది. అయితే ఢిల్లీ సర్కార్ నిర్ణయాన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో అత్యవసరమై వచ్చిన ఇతర రోగులకు ఇబ్బందికరమని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి.  


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo