బుధవారం 28 అక్టోబర్ 2020
National - Aug 23, 2020 , 17:49:20

అధికారంలోకి రాగానే 370 ని పునరుద్ధరిస్తాం

అధికారంలోకి రాగానే 370 ని పునరుద్ధరిస్తాం

న్యూఢిల్లీ : ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ భారత అనుకూల వైఖరిని తీసుకొని చాలా కాలమైంది. గతంలో ఎన్నడూ లేనంతాగా పార్టీ పతనమైంది. దేశంలోనే అతిపురాతనమైన పార్టీకి ఫుల్ టైం అధ్యక్షుడు కూడా లేక కొట్టుమిట్టాడుతున్నది. కొందరు రాహుల్ అధ్యక్షుడిగా ఉండాలని కోరుకుంటే.. మరికొందరు సోనియాగాంధీయే పగ్గాలు చేపట్టాలని భావిస్తున్నారు. ఇలాంటి సందిగ్దావస్థలో కొత్త పల్లవి తెరపైకి రావడంతో ఆసక్తికర చర్చకు దారితీసినట్లయింది. 

కాంగ్రెస్ ఎప్పుడు కేంద్రంలో తిరిగి అధికారంలోకి వచ్చినా ఆర్టికల్ 370 ను పునరుద్ధరించడం ద్వారా జమ్ముకశ్మీర్ రాష్ట్ర స్థితిని పునరుద్ధరిస్తుంది అని సీపీఐ (ఎం), పీడీపీ, ఎన్సీలతో కలిసి కాంగ్రెస్ అధిష్ఠానం సంయుక్త ప్రకటన విడుదల చేసింది. "జమ్ముకశ్మీర్ ప్రత్యేక హోదాను తిరిగి పొందడానికి, రాజ్యాంగ హామీలను పునరుద్ధరించడానికి అవిశ్రాంతంగా కష్టపడతాం" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. "2019 ఆగష్టు 5 న కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు రాజ్యాంగ విరుద్ధం. జమ్ముకశ్మీర్ ప్రజల ప్రాథమిక గుర్తింపునకు సవాలు. ఆర్టికల్స్ 370, 35 ఏ.. జమ్ముకశ్మీర్ రాజ్యాంగం,  రాష్ట్ర పునరుద్ధరణ కోసం కృషి చేయడానికి కట్టుబడి ఉన్నాం. రాష్ట్ర విభజన మాకు ఆమోదయోగ్యం కాదు” అని ప్రకటనలో తెలిపారు. 

జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 ను ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించినప్పుడు.. కాంగ్రెస్ పార్టీలోని యువ నాయకులు చిన్న తిరుగుబాటును తీసుకువచ్చారు. బహిరంగంగా పార్టీ శ్రేణికి వ్యతిరేకంగా వెళ్లి ఆర్టికల్ 370 ను రద్దు చేయడాన్ని సమర్థించారు. జ్యోతిరాదిత్య సింధియా, దీపెందర్ హుడా, జితిన్ ప్రసాద, ఆర్పీఎన్ సింగ్ బహిరంగంగా పార్టీ అధిష్ఠానాన్ని సవాలు చేసిన విషయం తెలిసిందే. సింధియా, హుడా వంటి యువనాయకుల వైఖరికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు జనార్దన్ ద్వివేది, అభిషేక్ మను సింగ్వి, మిలింద్ దేవరా మద్దతు కూడా ఇచ్చారు.


logo