ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 14, 2020 , 13:19:16

సుశాంత్ మ‌ర‌ణం వెనుక ఉన్న ర‌హ‌స్యం బ‌య‌ట‌కు రావాలి: శివ‌సేన‌

సుశాంత్ మ‌ర‌ణం వెనుక ఉన్న ర‌హ‌స్యం బ‌య‌ట‌కు రావాలి:  శివ‌సేన‌

హైద‌రాబాద్‌: బాలీవుడ్ హీరో  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును సీబీఐకి అప్ప‌గించాల‌ని డిమాండ్ పెరుగుతున్న విష‌యం తెలిసిందే.  ఈ కేసును సీబీఐకి అప్ప‌గించాల‌ని సెల‌బ్రిటీలు ఆన్‌లైన్‌లో హ్యాష్‌ట్యాగ్‌ల‌తో త‌మ డిమాండ్‌ను వ్య‌క్తం చేస్తున్నారు. అయితే సుశాంత్ అనుమానాస్ప‌ద మ‌ర‌ణంపై శివ‌సేన నేత సంజ‌య్ రౌత్ మ‌ళ్లీ స్పందించారు.  సుశాంత్ త‌మ కుమారుడ‌ని, అత‌ను ముంబైలో జీవించాడ‌ని, అత‌నో న‌టుడు అని సంజ‌య్ రౌత్ తెలిపారు. ముంబై ఫ్యామిలీలో బాలీవుడ్ కూడా ఒక‌ట‌ని, సుశాంత్ ప‌ట్ల మాకెందుకు శ‌త్రుత్వం ఉంటుంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.  సుశాంత్ మృతి కేసులో అత‌ని కుటుంబానికి న్యాయం జ‌ర‌గాల‌ని మేం కూడా కోరుకుంటున్నామ‌న్నారు. సుశాంత మ‌ర‌ణం వెనుక ఉన్న ర‌హ‌స్యం బ‌య‌ట‌కు రావాల‌న్నారు.  

సుశాంత్ కుటుంబం ప‌ట్ల త‌మ‌కు పూర్తి సానుభూతి ఉంద‌ని రౌత్ తెలిపారు.  సుశాంత్ కుటుంబ స‌భ్యులు కొంత ఓపికతో ఉండాల‌ని నిన్న తాను చెప్పిన‌ట్లు తెలిపారు.  కానీ తానెవ్వ‌రినీ బెదిరించ‌లేద‌న్నారు.  ముంబై పోలీసుల్ని న‌మ్మండి, ఒక‌వేళ వాళ్లు స‌రైన ద‌ర్యాప్తు చేయ‌డం లేద‌ని అనిపిస్తే, అప్పుడు సీబీఐ విచార‌ణ‌కు వెళ్లండి అని శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్ తెలిపారు.  సుశాంత్ జూన్ 14వ తేదీన బాంద్రాలోని త‌న ఇంట్లో ఉరి వేసుకుని చ‌నిపోయాడు. ఈ కేసును ఆత్మ‌హ‌త్య‌గా ముంబై పోలీసులు తేల్చారు. కానీ అనుమాస్ప‌ద ఆరోప‌ణ‌లు రావ‌డంతో.. ఇప్ప‌టికే ఈ కేసులో 40 మందికిపైగా విచార‌ణ జ‌రిపారు. 

ఈ కేసులోనే పాట్నాలోనూ ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది.  సీబీఐ విచార‌ణ చేప‌ట్టాల‌ని బీహార్ ప్ర‌భుత్వం కేంద్రాన్ని కోరింది. దానికి కేంద్రం కూడా అంగీక‌రించింది. సుశాంత్ అకౌంట్లో ఉన్న డ‌బ్బు మాయ‌మైన తీరు ప‌ట్ల ప్ర‌స్తుతం ముంబై పోలీసులు విచార‌ణ చేప‌డుతున్నారు.  మ‌నీల్యాండ‌రింగ్ కేసు న‌మోదు చేసిన ఈడీ .. ఈ కేసులో సుశాంత్ గ‌ర్ల్‌ఫ్రెండ్ రియా చ‌క్ర‌వ‌ర్తిని, ఆమె కుటుంబాన్ని విచారిస్తున్నారు. సుశాంత్ మృతి కేసులో సీబీఐ విచార‌ణ చేప‌ట్టాల‌ని ప్ర‌స్తుతం ఆన్‌లైన్‌లో ప్ర‌చారం సాగుతున్న‌ది. CBIforSSR, JusticeForSSR అన్న హ్యాష్‌ట్యాగ్‌ల‌తో డిమాండ్ చేస్తున్నారు. బాలీవుడ్ హీరో వ‌రుణ్ ధావ‌న్ కూడా సుశాంత్ మృతి కేసులో సీబీఐ విచార‌ణ చేప‌ట్టాల‌ని తాజాగా డిమాండ్ చేశారు. 
logo