బుధవారం 08 జూలై 2020
National - Jun 30, 2020 , 17:07:08

కరోనాను తగ్గించే ఔషధమని చెప్పలేదు: పతంజలి

కరోనాను తగ్గించే ఔషధమని చెప్పలేదు: పతంజలి

లక్నో: తాము తయారు చేసిన ఉత్పత్తి (కరోనిల్‌) కరోనా వైరస్‌ను తగ్గించే లేదా నివారించే ఔషధంగా చెప్పలేదని పతంజలి సంస్థ తెలిపింది. ఒక ఔషధాన్ని తయారు  చేశామని, దానిని క్లినికల్‌ ట్రయల్స్‌లో వినియోగించగా కొందరు కరోనా రోగులు కోలుకున్నట్లు మాత్రమే తెలిపామని ఆ సంస్థ సీఈవో ఆచార్య బాలకృష్ణ పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి గందరగోళం లేదని ఆయన చెప్పారు. ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలి తయారు చేసిన ‘కరోనిల్‌’ను ఆ సంస్థ బ్రాండ్‌ అంబాసిడర్‌, ప్రముఖ యోగ గురువు బాబా రామ్‌దేవ్‌ ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే. తమ ఔషధం కరోనాను తగ్గిస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 

అయితే, పతంజలి కరోనా ఔషధం ‘కరోనిల్‌’కు తమ అనుమతి లేదని ఐసీఎంఆర్‌తోపాటు ఆయూష్‌ శాఖ ఇటీవల స్పష్టం చేశాయి. వారి ఉత్పత్తిపై వివరణ కోరాయి. కాగా, కరోనా కిట్‌ పేరుతో ఎలాంటి ఉత్పత్తులను తాము అమ్మడం లేదని, కరోనిల్‌ ప్యాకేజీపై కరోనా వైరస్‌ను పోలిన బొమ్మను మాత్రమే ముద్రించినట్లు పతంజలి సంస్థ వివరణ ఇచ్చిందని ఉత్తరాఖండ్‌ ఆయుర్వేద శాఖకు చెందిన లైసెన్స్‌ అధికారి వైఎస్‌ రావత్‌ చెప్పారు. ఆ సంస్థకు చెందిన కరోనిల్‌తోపాటు మరో రెండు ఔషధాలను పరీక్ష కోసం ల్యాబ్‌లకు పంపినట్లు ఆయన వెల్లడించారు. మరోవైపు ‘కరోనిల్‌’ ఔషధాన్ని అమ్మినా, ప్రచారం చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర, రాజస్థాన్‌తోపాలు పలు రాష్ట్రాల ప్రభుత్వాలు హెచ్చరించాయి. పతంజలి సంస్థతోపాటు, బాబా రామ్‌దేవ్‌కు వ్యతిరేకంగా పలు చోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. 


logo