గురువారం 03 డిసెంబర్ 2020
National - Nov 22, 2020 , 09:23:21

త్వరలోనే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు : ఓం బిర్లా

త్వరలోనే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు : ఓం బిర్లా

న్యూఢిల్లీ : పార్లమెంట్‌ శీతాకాల సమవేశాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని, త్వరలోనే ప్రభుత్వం తేదీలు నిర్ణయిస్తుందని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అన్నారు. దేశ రాజధానిలో పెరుగుతున్న కొవిడ్‌-19 కేసుల నేపథ్యంలో పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల నిర్వహణపై నెలకొన్న ఊహాగానాల మధ్య స్పీకర్‌ వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి మధ్య అన్ని జాగ్రత్తలతో వర్షాకాల సమావేశాలు జరిగాయని, పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీలు క్రమం తప్పకుండా సమావేశవుతున్నాయన్నారు. పార్లమెంట్‌ సమావేశాలు నిర్వహించేందుకు లోక్‌సభ సిద్ధంగాఉందని, తేదీలను పార్లమెంట్‌ వ్యవహారాల కేబినెట్‌ నిర్ణయిస్తుందని ఓం బిర్లా తెలిపారు. పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సెషన్‌ తేదీలను నిర్ణయించడంతో పాటు ప్రతిపక్ష పార్టీలతోనూ చర్చిస్తుందని లోక్‌సభ స్పీకర్‌ పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ 25 నుంచి రెండు రోజుల పాటు వడోదరలోని కెవాడియాలో అఖిల భారత ప్రిసైడింగ్‌ అధికారుల సమావేశం జరుగనుంది. ఇందులో రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బోబ్డే ప్రసంగించనున్నారు. శాసన సభ, కార్యనిర్వహక న్యాయవ్యవస్థల మధ్య ‘సామరస్యపూర్వక సమన్వయం, శక్తివంతమైన ప్రజాస్వామ్యానికి’ అనే అంశంపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు.  


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.