సోమవారం 30 మార్చి 2020
National - Feb 25, 2020 , 21:42:07

భారత్‌కు మళ్లీ వస్తాం: ట్రంప్‌

భారత్‌కు మళ్లీ  వస్తాం: ట్రంప్‌

న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గౌరవార్థం విందు ఏర్పాటు చేశారు. విందు ఆరగించే ముందు ట్రంప్‌ మాట్లాడారు. భారత పర్యటన అద్భుతమన్నారు. ఈ రెండు రోజులు క్షణాల్లా గడిచిపోయాయని ఆయన అన్నారు. మీ ఆతిథ్యం మాకు ఎంతగానో నచ్చింది. అమెరికన్‌ ఫస్ట్‌ లేడి మెలానియా భారత్‌ను అమితంగా ఇష్టపడుతుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు ఇలాగే కొనసాగాలని ట్రంప్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. మోది నాకు చాలా మంచి మిత్రుడు. ఆయన టెక్సాస్‌కు వచ్చినపుడు ఎంత ఉత్సాహంగా ఉన్నారో అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారన్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌ ఐ లవ్‌ ఇండియా అన్నారు. ఈ సమయంలో విందులో ఉన్న అతిరథులంతా కరతాళధ్వనులతో తమ సమ్మతిని తెలియజేశారు. మాకు ఇంత గొప్ప విందు ఏర్పాటు చేసిన భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోదికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ట్రంప్‌ వెల్లడించారు. 

అంతకు ముందు, రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న ట్రంప్‌ దంపతులను రాష్ట్రపతి కోవింద్‌ దంపతులు సాదరంగా ఆహ్వానించారు. వారికి రాష్ట్రపతి భవన్‌ విశిష్టతను గురించి చెప్పారు. అనంతరం, ప్రధాని నరేంద్రమోది, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్రమంత్రులు, వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు, అధికారులు రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. వారందరినీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌.. ట్రంప్‌కు పరిచయం చేశారు. పరిచయ కార్యక్రమం అనంతరం, డిన్నర్‌ టేబుల్‌ వద్దకు చేరుకున్న వారు.. తమకు కేటాయించిన సీట్లలో ఆశీనులయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడారు. భారత పర్యటనకు తొలిసారి విచ్చేసిన అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌, ఆయన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. అమెరికా ప్రెసిడెంట్‌.. ఇండియాకు రావడం గౌరవంగా భావిస్తున్నామని రాష్ట్రపతి పేర్కొన్నారు.

రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య బలమైన బంధం ఏర్పడినట్లు కోవింద్‌ తెలిపారు. వాణిజ్య పరంగానూ ఇరు దేశాలు నూతన చరిత్రను లిఖించాయని రాష్ట్రపతి పేర్కొన్నారు. హోస్టన్‌ నిర్వహిచిన ‘హౌడీ-మోది’ కార్యక్రమం ఎలా విజయవంతమయిందో.. నిన్న మొతెరా మైదానంలో నిర్వహించిన ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమం కూడా అత్యంత విజయవంతమయిందని ఆయన తెలిపారు. ట్రంప్‌ దంపతులను భారత్‌ విశేషంగా ఆకట్టుకున్నదని భావిస్తున్నట్లు రాష్ట్రపతి తెలిపారు. అమెరికాలో మిలియన్ల కొద్ది భారత ప్రజలు నివసిస్తున్నారనీ.. వారు అమెరికాకు సేవ చేస్తున్నారని రాష్ట్రపతి ఈ సందర్భంగా తెలియజేశారు. మీరు, మీ కుటుంబం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని రాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు. 

కాగా, ఈ విందులో శాకాహార, మాంసాహార వంటకాలు సిద్దం చేశారు. ట్రంప్‌కు ఇష్టమైన అన్ని రకాల వెరైటీలు ఈ విందులో పొందుపర్చినట్లు తెలుస్తోంది.


logo