శనివారం 16 జనవరి 2021
National - Dec 30, 2020 , 23:44:27

బిగ్ బ్ర‌ద‌ర్ అన్నాడీఎంకే.. కానీ సీఎం అభ్య‌ర్థిపై ఇలా

బిగ్ బ్ర‌ద‌ర్ అన్నాడీఎంకే.. కానీ సీఎం అభ్య‌ర్థిపై ఇలా

చెన్నై: వ‌చ్చే ఏడాది జ‌రిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మిళ‌నాట అధికార అన్నాడీఎంకే.. ఎన్డీఏ కూట‌మికి సార‌థ్యం వ‌హిస్తుంద‌ని బీజేపీ తెలిపింది. బీజేపీ త‌మిళ‌నాడు ఇన్‌చార్జీ, జాతీయ కార్య‌ద‌ర్శి సీటీ ర‌వి బుధ‌వారం మీడియాతో మాట్లాడుతూ.. దేశ‌వ్యాప్తంగా ఎన్డీఏ కూట‌మికి బీజేపీ సార‌థ్యం వ‌హిస్తుంద‌న్నారు. త‌మిళ‌నాడులో అన్నాడీఎంకే నాయ‌క‌త్వంలో తాము ప‌ని చేస్తామ‌ని చెప్పారు.

బీజేపీతో అధికార భాగ‌స్వామ్యం ప్ర‌స‌క్తే లేద‌ని అన్నాడీఎంకే చెప్ప‌డంతోపాటు సీఎం అభ్య‌ర్థి ఎడ్ల‌పాడి ప‌ళ‌నిస్వామి అని అధికార ఏఐఏడీఎంకే ప్ర‌క‌టించిన మూడు రోజుల‌కు బీజేపీ పై విధంగా వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. సీఎం అభ్య‌ర్థిపై నిర్ణ‌యాధికారం అన్నాడీఎంకేదేన‌ని, అయితే ఎన్డీఏ స‌మ‌న్వ‌య క‌మిటీ అధికారికంగా ప్ర‌క‌టిస్తుంద‌ని సీటీ ర‌వి అన్నారు. 

అంత‌కుముందు బీజేపీ రాష్ట్ర నేత‌లు మాట్లాడుతూ సీఎం అభ్య‌ర్థి ప్ర‌క‌ట‌న‌కు ఒక ప్ర‌క్రియ ఉందంటూ ఆ విష‌యాన్ని వివాదాస్ప‌దం చేయ‌డానికి ప్ర‌య‌త్నించారు. త‌మ పార్టీకి సంబంధించిన వ‌ర‌కు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా రాజ‌కీయ నిర్ణ‌యాలు ప్ర‌క‌టిస్తార‌ని ఆ పార్టీ సీనియ‌ర్ నేత ఒక‌రు చెప్పారు. ఇప్ప‌టికే రాష్ట్రంలో ప‌ర్య‌టించాల్సి ఉన్నా.. ఆయ‌న‌కు క‌రోనా సోక‌డంతో చెన్నైలో న‌డ్డా ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింద‌న్నారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.