గురువారం 09 జూలై 2020
National - Jun 30, 2020 , 16:15:43

వాటర్‌ప్రూఫ్‌ దుస్తులతో ప్రాణాలు దక్కించుకున్న చైనా సైనికులు

వాటర్‌ప్రూఫ్‌ దుస్తులతో ప్రాణాలు దక్కించుకున్న చైనా సైనికులు

న్యూఢిల్లీ:  లఢక్‌ సరిహద్దులోని గల్వాన్‌ లోయ వద్ద ఈ నె 15న భారత్‌, చైనా మధ్య జరిగిన ఘర్షణలో నదిలో పడిపోయిన చైనా సైనికులలో కొందరు వాటర్‌ప్రూఫ్‌ దుస్తులవల్ల ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తున్నది. ఈ ఘర్షణలో తెలంగాణకు చెందిన కర్నల్‌ సంతోష్‌ బాబుతో సహా 20 మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. చైనా వైపు కూడా భారీగా ప్రాణ నష్టం జరిగి ఉంటుందని, 40 నుంచి 45 మంది సైనికులు చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. అయితే చైనా మాత్రం దీనిపై నోరు విప్పడం లేదు.

భారత్‌, చైనా వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) సమీపంలోని ఫింజర్‌, గల్వాన్‌ లోయ, డీబీఓ సెక్టార్‌, పీపీ-15, ఘోఘ్రా ప్రాంతాల్లో మే 4 నుంచి చైనా తన సైన్యాన్ని భారీగా మోహరిస్తున్నది. తగిన ఆయుధ సంపత్తితోపాటు ప్రకృతి వైపరిత్యాలను తట్టుకునేలా వారు సిద్ధపడినట్లు తెలుస్తున్నది. అక్సాయ్ చిన్‌లో మొదలయ్యే గల్వాన్‌ నది ఎల్‌ఏసీని దాటి భారత సైనిక నిఘా పోస్టు పీపీ-14 సమీపంలోని షయోక్‌ నదిలో కలుస్తుంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో హిమాలయాల్లోని మంచు కరగడం వల్ల గల్వాన్‌ నదిలోకి నీటి ప్రవాహం పెరుగుతున్నది. ఈ నదిలోని నీరు ఎంతో చల్లగా ఉంటుంది. ఈ క్రమంలో గల్వాన్‌ లోయ ప్రాంతాల్లో విధులు నిర్వహించే సైనికులకు వాటర్‌ఫ్రూఫ్‌ వంటి ప్రత్యేక దుస్తులు, బూట్లు ఎంతో అవసరం. 

ఈ నెల 15న పీపీ-14 వద్ద భారత్‌, చైనా సైనికులు ముఖాముఖిగా తలపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ఇరు దేశాలకు చెందిన పలువురు సైనికులు గల్వాన్‌ నదిలో పడిపోయారు. అందులోని నీరు గడ్డకట్టే అంత చల్లగా ఉంటుంది. దీంతో నదిలో పడిన వారు ఎక్కువ సేపు ప్రాణాలతో ఉండలేరు. శరీర ఉష్ణోగ్రతలు పడిపోవడం మరణానికి దారి తీస్తుంది. తాజా ఘర్షణలో 20 మంది భారత సైనికులు చనిపోవడానికి ఇది కూడా కారణంగా తెలుస్తున్నది. మరోవైపు ఈ ఘర్షణలో చైనా సైనికులు కూడా పెద్ద సంఖ్యలో నదిలో పడిపోయినప్పటికీ వారు ధరించిన వాటర్‌ప్రూఫ్‌ దుస్తులు, బూట్లు వారి ప్రాణాలను కాపాడినట్లు అంచనా వేస్తున్నారు. 

ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో గల్వాన్‌ నదిలో నీటి ప్రవాహం పెరుగుతున్నది. అక్కడ విధులు నిర్వహించే భారత జవాన్లు కొన్ని సందర్భాల్లో నదిలోకి దిగి అవతల వైపునకు వెళ్లవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో భారత సైనికులకు కూడా ప్రత్యేక వాటర్‌ప్రూఫ్‌ దుస్తులు, బూట్లు ఎంతో అవసరమని రక్షణ రంగ నిఫుణులు చెబుతున్నారు. కాగా, ఓవైపు చర్చలంటూనే మరోవైపు తన సైన్యాన్ని చైనా భారీగా మోహరిస్తున్నది. ఇటీవల వెలుగుచూసిన ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ విషయం బయటపడింది. ఈ నేపథ్యంలో చైనా సరిహద్దులోని భారత సైనికులకు అక్కడి పరిస్థితులను తట్టుకునే విధంగా వాటర్‌ప్రూఫ్‌ దుస్తులు, బూట్లను సరఫరా చేయాల్సిన అవసరం ఉన్నదని రక్షణ రంగ నిఫుణులు పేర్కొన్నారు. 


logo