సోమవారం 18 జనవరి 2021
National - Dec 20, 2020 , 19:45:37

పర్మిట్‌లేకుండా విదేశీ నిధులా?

పర్మిట్‌లేకుండా విదేశీ నిధులా?

చండీగఢ్‌: కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ దేశ రాజధాని ఢిల్లీలో అన్నదాతలు చేపట్టిన ఆందోళనకు సారథ్యం వహిస్తున్న ఓ రైతు సంఘం సరైన అనుమతుల్లేకుండానే విదేశీ నిధులు స్వీకరిస్తున్నదన్న ఆరోపణలు వచ్చాయి. పంజాబ్‌లో మద్దతుదారుల పునాది కలిగి ఉండటంతోపాటు అతిపెద్ద రైతు సంఘంగా పేరొందిన భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేఎస్‌)పై ఈ అభియోగాలు వచ్చాయి. విదేశీ నిధుల స్వీకరణపై పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ సదరు యూనియన్‌ను హెచ్చరించింది. సంబంధిత నియంత్రణ సంస్థ వద్ద యూనియన్‌ పేరు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని సూచించింది. 

ఈ విషయమై కేంద్రంలోని ఫారెక్స్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి తమకు మెయిల్‌ వచ్చిందని పంజాబ్‌లోని మొగా జిల్లాలోని పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ శాఖ అధికారులు తనకు చెప్పారని బీకేయూ ప్రధాన కార్యదర్శి సుఖ్‌దేవ్‌ సింగ్‌ కోక్రి కలాన్‌ తెలిపారు. గత రెండు నెలల్లో బీకేయూకు రూ.8 నుంచి రూ.9 లక్షల నిధులు వచ్చాయి. ఈ నిధులన్నీ విదేశాల్లో నివసిస్తున్న పంజాబీలే పంపారని, వారు నిరంతరం సామాజిక సమస్యల పరిష్కారం కోసం విరాళాలిస్తారని సుఖ్‌దేవ్‌ సింగ్‌ తెలిపారు. అయితే, బ్యాంకు నుంచి రాతపూర్వక సమాచారం వస్తే దానిపై స్పందిస్తామన్నారు. 

బీకేయూ అధినేత జోగిందర్‌ ఉగ్రహ మాట్లాడుతూ పంజాబ్‌ నుంచి వెళ్లి విదేశాల్లో స్థిర పడిన ఎన్నారైలు తమకు నిధులు పంపుతున్నారన్నారు. వారు తమకు సాయం చేస్తే వచ్చే సమస్య ఏమిటని ప్రశ్నించారు. తమ ఆందోళనలో వారు కూడా భాగస్వాములవుతున్నారని చెప్పారు. గత కొన్నేండ్లు కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్‌ విదేశీ నిధులు, విరాళాల స్వీకరణపై నిబంధనలను కఠినతరం చేసింది. పలు సంస్థలపై ఆంక్షలు విధించింది. 

రైతుల ఆందోళనను విచ్చిన్నం చేయడానికే కేంద్రం రైతు సంఘాలపై పన్ను చట్టాలను ఉపయోగిస్తున్నదని పంజాబ్‌ సీఎం అమరిందర్‌ సింగ్‌ ఆరోపించారు. ఇంతకుముందు రైతుల ఆందోళనకు మద్దతు పలికిన కమీషన్‌ ఏజెంట్ల ఆస్తులపైనా పన్నుల శాఖ అధికారులు దాడులు చేశారు. నోటీసులు జారీ చేసిన తర్వాత వారి సమాధానం కోసం వేచిచూడకుండానే నాలుగు రోజుల్లోనూ కమిషన్‌ ఏజంట్ల ఆస్తులపై దాడులు చేశారని.. రైతు సంఘాలను పన్ను చట్టాల పరిధిలోకి తేవడం రాజకీయ కక్ష సాధింపు చర్యేనని అమరీందర్‌ సింగ్‌ ఆరోపించారు. రైతుల ఆందోళను బలహీనపరిచేందుకు తొలుత వారిని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించిన కేంద్రం.. తాజాగా అన్నదాతల మధ్య విభేదాలను సృష్టించడానికి ప్రయత్నిస్తోందన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.