న్యూఢిల్లీ, జూలై 16: అధిక ఉష్ణోగ్రతలను తట్టుకుని నిల్వ ఉండే కొవిడ్-19 వ్యాక్సిన్ (వెచ్చని టీకా) ఫార్ములాను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) బెంగళూరు పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ టీకా డెల్టా సహా ఆందోళన కలిగించే అన్ని రకాల వేరియంట్లపై సమర్థంగా పనిచేస్తున్నట్టు తెలిపారు. చిట్టెలుకలపై చేసిన ప్రయోగాల్లో ఈ విషయం రుజువైనట్టు వెల్లడించారు. ఈ వివరాలు ‘ఏసీఎస్ ఇన్ఫెక్టియస్ డిసీజెస్’ జర్నల్లో గురువారం ప్రచురితమయ్యాయి. 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల వద్ద నెల రోజులపాటు, 100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల వద్ద 90 నిమిషాల పాటు ఈ టీకాను నిల్వ ఉంచవచ్చని పరిశోధకులు వెల్లడించారు. ఉష్ణమండల ప్రాంతాల్లోని దేశాలు, కోల్డ్ స్టోరేజీ సదుపాయాలులేని దేశాలకు ఈ టీకా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.