బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Feb 19, 2020 , 02:33:45

పౌరసత్వ నిరూపణకు భూమి, బ్యాంకు పత్రాలు చెల్లవు

పౌరసత్వ నిరూపణకు భూమి, బ్యాంకు పత్రాలు చెల్లవు
  • గువాహటి హైకోర్టు వెల్లడి

గువాహటి, ఫిబ్రవరి 18: పౌరసత్వ నిరూపణకు బ్యాంకు, భూమి పత్రాలు పనికిరావని గువాహటి హైకోర్టు స్పష్టం చేసింది. అసోంలో నిర్వహించిన జాతీయ పౌర జాబితాలో దాదాపు 19 లక్షల మంది భారతీయులు కాదన్న విషయం వెల్లడైన సంగతి తెలిసిందే. అయితే వీరంతా తాము భారతీయులమేనని నిరూపించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం విదేశీ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో జాబెదా బేగం అలియాస్‌ జాబెదా ఖాతున్‌ అనే మహిళ విదేశీ ట్రిబ్యునల్‌లో పిటిషన్‌ దాఖలు చేశారు. తన తండ్రి, తన భర్త పేరిట గ్రామ అధికారులు జారీ చేసిన గుర్తింపు పత్రాలతోపాటు మరికొన్ని పత్రాలను ఆమె ట్రిబ్యునల్‌లో సమర్పించారు. అయితే వీరిద్దరితో తనకు ఉన్న బంధాన్ని నిరూపించే పత్రాలను మాత్రం సమర్పించలేదు. దీన్ని గుర్తించిన ట్రిబ్యునల్‌ ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఆమె హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం విదేశీ ట్రిబ్యునల్‌ నిర్ణయాన్ని సమర్థించింది. ‘పౌరసత్వ నిరూపణకు పాన్‌కార్డు, బ్యాంకు పత్రాలు పనికిరావని 2016లో ఇదే హైకోర్టు తీర్పునిచ్చింది. ఇదే సమయంలో భూమి పత్రాలు కూడా పౌరసత్వ నిరూపణకు పనికిరావు’ అని ధర్మాసనం పేర్కొంది. మరో కేసులో విచారణ జరిపిన ఇదే ధర్మాసనం ఓటరు గుర్తింపుకార్డులు కూడా పౌరసత్వ నిరూపణకు పనికిరావని వెల్లడించింది.


logo
>>>>>>