శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 12, 2020 , 17:48:01

పాత కరెన్సీ నోట్లను కలిగి ఉన్న అంధ దంపతులు .. సీఎంకు విజ్ఞాపన

పాత కరెన్సీ నోట్లను కలిగి ఉన్న  అంధ దంపతులు .. సీఎంకు విజ్ఞాపన

చెన్నై : పాత 500, 1000 కరెన్సీ నోట్లు రద్దు అయిన విషయం తెలియని అంధ దంపతులు తమను ఆదుకోవాల్సిందిగా కోరుతూ సీఎంకు మెమోరాండం పంపారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఈరోడ్‌ జిల్లా పోతియా ముపానురే అనే మారుమూల గ్రామ నివాసి సోము(58), ఇతని భార్య పళనియమ్మల్‌. ఇరువురు అగరుబత్తీలు, కర్పూరం అమ్మకం ద్వారా జీవనం సాగిస్తున్నారు. గత పదేళ్లుగా ఇలా వచ్చిన కొద్ది మొత్తాల్ని రూ. 1000, రూ. 500 నోట్లుగా మార్చి తన తల్లి వద్ద దాచి ఉంచాడు.

ఇలా దాచిన మొత్తం పాత కరెన్సీలో రూ. 24 వేలు ఉంది. డిమానిటైజేషన్‌ గురించి తెలియని సోము గడిచిన శుక్రవారం నగదును తీసుకుని డిపాజిట్‌ నిమిత్తం బ్యాంకుకు వెళ్లాడు. అక్కడి అధికారులు ఇవి రైద్దెనా నోట్లు అని చెప్పడంతో డిమానిటైజేషన్‌ గురించి అప్పుడే అతనికి తెలిసింది. పాత రూ. 1000, రూ. 500 నోట్లను కేంద్ర ప్రభుత్వం 2016లోనే బ్యాన్‌ చేసిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ కారణంగా గడిచిన నాలుగు నెలలుగా అంధ దంపతుల జీవనం కష్టంగా మారింది. 

 తనకు కానీ తన కుటుంబ సభ్యులకుగానీ నోట్ల రద్దు విషయం తెలియదని సోమూ తెలిపాడు. సహాయం కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామికి మెమోరాండం పంపాడు. దీనిపై దర్యాప్తు చేస్తామని పోలీసులు వెల్లడించారు. ఇటువంటి ఘటనే గతేడాది తిరుపూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఇద్దరు మహిళల వద్ద పొదుపు సొమ్ము రూ. 46 వేలు పాత నోట్లు ఉన్నాయి. అయితే ఆ సమయంలో విషయం తెలిసిన జిల్లా కలెక్టర్‌ కె. విజయ కార్తికేయన్‌ సోదరీమణులిద్దరికీ వృద్ధాప్య పింఛను మంజూరు చేశారు. 


logo