బుధవారం 03 జూన్ 2020
National - May 09, 2020 , 01:39:45

వుహాన్‌లో మోగిన బడిగంట

వుహాన్‌లో మోగిన బడిగంట

  • మూణ్నెళ్ల లాక్‌డౌన్‌ తర్వాత తెరుచుకున్న స్కూళ్లు
  • విద్యార్థులకు విడివిడిగా ప్లాస్టిక్‌ క్యాబిన్లు
  • గేట్ల వద్ద థర్మల్‌ స్కానర్లు.. ఉచితంగా మాస్క్‌లు

వుహాన్‌: కరోనా మహమ్మారికి పుట్టినిల్లయిన చైనాలోని వుహాన్‌ నగరంలో దాదాపు మూడు నెలల లాక్‌డౌన్‌ తర్వాత పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. 50,000 మందికిపైగా విద్యార్థులు తిరిగి బడులకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తి నివారణకు అక్కడికి అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టారు. విద్యార్థులకు ఉచితంగా మాస్క్‌లను అందజేస్తున్నారు. తరగతి గదుల్లో ఒక్కో విద్యార్థికి మూడడుగులు దూరం ఉండేలా సీటింగ్‌ ఏర్పాటుచేశారు. విద్యార్థుల డెస్క్‌పై పారదర్శకంగా ఉండే ప్లాస్టిక్‌ క్యాబిన్లను ఏర్పాటుచేశారు. విద్యార్థులు ఒకరికొకరు మాట్లాడుకున్నప్పుడు లాలాజలం మీదపడకుండా ఇది రక్షణ కల్పిస్తుంది. మడత పెట్లేందుకు వీలుగల వీటిని విద్యార్థులు భోజనానికి వెళ్లేటప్పుడు కూడా తమతోపాటు తీసుకెళ్లాల్సి ఉంటుంది. పలు క్లాస్‌రూమ్‌లను కూడా క్యాంటిన్‌లుగా మలిచారు. ఒక్కో రూమ్‌కు 20 మందికి మించి అనుమతించరు. పాఠశాలలకు వెళ్లే ముందు విద్యార్థులు, సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు, అలాగే పాఠశాలల భవనాలను సైతం శుద్ధిచేసినట్లు వుహాన్‌లోని అధికారులు తెలిపారు. పాఠశాలల గేట్ల వద్ద థర్మల్‌ స్కానర్లను ఏర్పాటుచేశారు. ఉష్ణోగ్రత అధికంగా ఉన్న వారికి లోపలికి అనుమతించరు. వుచాంగ్‌ ఎక్స్‌పరిమెంట్‌ మిడిల్‌ స్కూల్‌లో విద్యార్థులు తరగతి గదిలోకి ప్రవేశించే ముందు శుభ్రంగా చేతులను కడుక్కోవాల్సి ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత అసాధారణంగా ఉన్నవారి కోసం పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా అబ్జర్వేషన్‌ రూమ్‌ను ఏర్పాటుచేసింది. చైనాలోని మిగిలిన ప్రాంతాల్లో గత నెలలోనే బడులు తెరుచుకున్నాయి. బీజింగ్‌, షాంఘైలలో గతవారం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. గత నెల కాలంగా వుహాన్‌లో ఎలాంటి కొత్త వైరస్‌ కేసులు నమోదుకాలేదు.

దక్షిణ కొరియాలో స్కూళ్ల పునఃప్రారంభం జాప్యం

సియోల్‌: ఈ వారాంతంలో మళ్లీ కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైతే దేశంలోని స్కూళ్ల పునఃప్రారంభం జాప్యం అవుతుందని దక్షిణ కొరియా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రాల డైరెక్టర్‌ జేంగ్‌ యిన్‌ క్యాంగ్‌ పేర్కొన్నారు. కొన్ని వారాలుగా కరోనా కేసులు తగ్గిపోవడంతో హైస్కూళ్లను ఈ నెల 13 నుంచి పునః ప్రారంభించాలని దక్షిణ కొరియా ఇంతకుముందు నిర్ణయించింది. 


logo