బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 20, 2020 , 03:18:59

ముగిసిన ‘విరాట్‌' పర్వం

ముగిసిన ‘విరాట్‌' పర్వం

  • కనుమరుగు కానున్న ఐఎన్‌ఎస్‌ విరాట్‌ 
  • తుక్కుగా మార్చేయనున్న గుజరాత్‌ సంస్థ 
  • 29 ఏండ్లపాటు నేవీలో విరాట్‌ సేవలు 

ముంబై, సెప్టెంబర్‌ 19: భారత నావికాదళ చరిత్రలో ఒక ఘనమైన అధ్యాయం ముగియబోతున్నది. ‘ది గ్రాండ్‌ ఓల్డ్‌ లేడీ’గా ఖ్యాతిగాంచిన విమానవాహక నౌక ‘ఐఎన్‌ఎస్‌ విరాట్‌' త్వరలో కనుమరుగుకానున్నది. దాదాపు మూడేండ్ల క్రితమే సేవల నుంచి వైదొలిగిన ఈ యుద్ధనౌకను.. గుజరాత్‌లోని అలంగ్‌లో విడభాగాలుగా చేసి తుక్కు కింద అమ్మేయనున్నారు. ఈ మేరకు శనివారం ఈ నౌక ముంబై నావల్‌ డాక్‌యార్డ్‌ నుంచి గుజరాత్‌కు బయలుదేరింది. ఈ నేపథ్యంలో సుదీర్ఘకాలం ఈ నౌకలో విధులు నిర్వహించిన నౌకాదళ అధికారులు తీవ్రభావోద్వేగంతో, ఉబికివస్తున్న కన్నీటితో విరాట్‌కు వీడ్కోలు పలికారు. విరాట్‌ను మ్యూజియంగా లేదా రెస్టారెంట్‌గా మార్చాలని ప్రయత్నాలు జరిగినా అవి ఫలప్రదం కాలేదు. ఈ నౌకను అలంగ్‌కు చెందిన శ్రీరామ్‌ గ్రూప్‌ రూ.38.54 కోట్లకు వేలంలో దక్కించుకున్నది. మరో ఏడాదిలోపు దీన్ని స్క్రాప్‌ చేయనున్నట్లు కంపెనీ చైర్మన్‌ ముఖేశ్‌ పటేల్‌ తెలిపారు.

ఘనచరిత్ర 

  • ఐఎన్‌ఎస్‌ విరాట్‌ 1987లో భారత నావికాదళంలో చేరింది. దాదాపు 29 ఏండ్లపాటు నేవీలో సేవలందించింది. అంతకుముందు బ్రిటన్‌ రాయల్‌ నేవీలో 27 ఏండ్లపాటు విధులు నిర్వహించింది. అప్పట్లో దీనిని హెచ్‌ఎంఎస్‌ హెర్మ్‌గా పిలిచేవారు. ఇండియన్‌ నేవీలో చేరిన తర్వాత ఐఎన్‌ఎస్‌ విరాట్‌గా పేరుమార్చారు. మొత్తంగా అర్ధశతాబ్దానికిపైగా ఈ నౌక సేవలందించింది. 
  • భారత్‌లో  ఆపరేషన్‌ జూపిటర్‌, ఆపరేషన్‌ పరాక్రమ్‌, ఆపరేషన్‌ విజయ్‌ వంటి పలు కీలక మిలిటరీ ఆపరేషన్లలో విరాట్‌ పాలుపంచుకుంది. 
  • మలబార్‌, అరుణ, నజీమ్‌ అల్‌ బహర్‌, ట్రోపెక్స్‌ వంటి యుద్ధ విన్యాసాల్లోనూ పాల్గొంది. చివరిసారిగా 2016లో విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూలో పాల్గొన్నది. 
  • ఇండియన్‌ నేవీలో చేరే సమయంలో ఇది ఏడేండ్లకు మించి పనిచేయదని బ్రిటన్‌ అధికారులు భావించారు. అయితే 30 ఏండ్లపాటు సేవలందించింది.
  • విరాట్‌లో విధులు నిర్వహించిన నలుగురు అధికారులు అనంతరం నౌకాదళ అధిపతులుగా నియమితులయ్యారు.
  • ఐఎన్‌ఎస్‌ విరాట్‌ 1500 మంది సిబ్బందిని, 25 యుద్ధ విమానాలను మోసుకెళ్లగలదు. రెండో ప్రపంచయుద్ధ సమయంలో నిర్మితమై, ఇంతకాలం సేవలందించిన ఏకైక యుద్ధనౌక బహుశా విరాట్‌ మాత్రమేనని అంచనా


logo