సోమవారం 06 జూలై 2020
National - Jun 17, 2020 , 01:53:05

మంచు లోయలో నెత్తుటి ధార సరిహద్దు రక్తసిక్తం

మంచు లోయలో నెత్తుటి ధార సరిహద్దు రక్తసిక్తం

 • లఢక్‌లోని గాల్వాన్‌ లోయలో భారత్‌- చైనా బలగాల దాడులు
 • అమరుల్లో సూర్యాపేటకు చెందిన కర్నల్‌
 • 45 ఏండ్ల తర్వాత ఇరు సైనికుల మరణాలు 
 • సీడీఎస్‌, త్రివిధ దళాధిపతులతో సమీక్ష 
 • రాళ్లు, రాడ్లతో పరస్పరం దాడులు
 • మృతుల సంఖ్య పెరుగొచ్చని ఆందోళన
 • 43 మంది చైనా సైనికుల హతం
 • సరిహద్దులో భారత బలగాలు అప్రమత్తం
 • త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్‌ భేటీ
 • భారత సైన్యంలో కర్నల్‌ సహా 
 • 20 మంది జవాన్ల వీర మరణం
 • సరిహద్దు రక్తసిక్తం

తెల్లని మంచు కొండలు వెచ్చని నెత్తురుతో ఎరుపెక్కాయి! కొద్దివారాలుగా భారత్‌-చైనా సైనికుల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న వివాదాలు.. సోమవారం రాత్రి తీవ్ర హింసాత్మక ఘర్షణకు దారితీశాయి. శాంతి కోసం ఏర్పాటుచేసుకున్న ఇరు దేశాల కమాండర్ల సమావేశం ముగిసి, సైన్యాలను ఉపసంహరించుకుంటున్న తరుణంలో హింస పెచ్చరిల్లింది. రాడ్లు, రాళ్లే మారణాయుధాలయ్యాయి. తూర్పు లఢక్‌లోని గాల్వాన్‌ లోయలో చోటుచేసుకున్న ఈ ఘర్షణల్లో ఒక కర్నల్‌ సహా 20 మంది భారత జవాన్లు అసువులు బాశారు. చైనా సైనికుల్లో 43 మంది చనిపోయారు. భారత జవాన్లు మరింత మంది చనిపోయి ఉండొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 

న్యూఢిల్లీ, జూన్‌ 16: భారత్‌-చైనా సరిహద్దులు రక్తసిక్తమయ్యాయి. లఢక్‌లోని గాల్వాన్‌ లోయలో ఇరుదేశాల జవాన్లు పరస్పరం దాడులు చేసుకోవటంతో 20మంది భారత సైనికులు మరణించారు. చైనా సైనికులు 43 మంది మరణించినట్టు ఆ దేశ మీడియా తెలిపింది. నెలన్నర ఉద్రిక్తతల అనంతరం వాస్తవాధీన రేఖవెంబడి ఇరు పక్షాలు వెనుకకు తగ్గుతున్న సమయంలో సోమవారం ఘర్షణ తలెత్తింది. ఇరు దేశాల సైనికులు రాత్రి రాళ్లు, రాడ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో భారత కమాండింగ్‌ ఆఫీసర్‌ సహా 20మంది సైనికులు మరణించారని సైన్యం ప్రకటించింది. ఈ ఘటనపై రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ విదేశాంగమత్రి జైశంకర్‌, త్రివిధ దళాధిపతులు, సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌తో సమీక్షించారు. అనంతరం తాజా పరిస్థితిని ప్రధాని నరేంద్రమోదీకి ఫోన్లో వివరించారు.  

తారాస్థాయికి ఘర్షణ 

కొంతకాలంగా భారత సరిహద్దుల్లో సైన్యాన్ని పెంచుతూ వస్తున్న చైనా ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నది. లఢక్‌లోని గాల్వాన్‌ లోయ, ప్యాంగాంగ్‌ సో సరస్సు, డెమ్‌చోక్‌, దౌలత్‌బేగ్‌ ఓల్డీ ప్రాంతాల్లో వాస్తవాధీన రేఖను (ఎల్‌ఏసీ) దాటి భారత భూభాగాన్ని ఆక్రమించటంతో భారత సైన్యం ప్రతిఘటించింది. ఈ నెల 6 సైనిక జనరళ్ల స్థాయిలో చర్చలు జరిగిన అనంతరం గాల్వాన్‌, తూర్పు లఢక్‌ మినహా ఇతర ప్రాంతాల్లో ఇరు సైన్యాలు బలగాలను ఉపసంహరించుకున్నాయి. సోమవారం గాల్వాన్‌, ప్యాంగాంగ్‌ సో ప్రాంతాల్లో బ్రిగేడ్‌ కమాండర్ల స్థాయి చర్చల అనంతరం గాల్వాన్‌లో లోయలో సైన్యాలను ఉపసంహరించుకుంటున్న సమయలో సైనికుల మధ్య ఘర్షణ జరిగిందని భారత సైనిక అధికారులు తెలిపారు. చైనా సైనికులు రెచ్చగొట్టేలా ప్రవర్తించారని భారత సైన్యం చెప్తుండగా, భారత సైనికులే సరిహద్దు దాటి తమ భూభాగంలోకి ప్రవేశించి ఘర్షణ పడ్డారని చైనా ఆరోపించింది.

అసలేం జరిగింది?

గాల్వాన్‌ లోయలో వాస్తవాధీన రేఖను దాటి భారత భూభాగంలోకి ప్రవేశించిన చైనా సైనికులు భారీ ఎత్తున టెంట్లు వేసుకొని ఐదువారాలుగా అక్కడే ఉన్నారు. కమాండర్ల స్థాయిలో పలుదఫాల చర్చల అనంతరం సోమవారం రాత్రి ఇరు పక్షాలు సైనికులను ఉపసంహరించాలని నిర్ణయించాయి. ఆ సమయంలో పాయింట్‌ 14 వద్ద వేసిన టెంట్‌ను తొలిగించేందుకు చైనా సైనికులు నిరాకరించటంతో ఘర్షణ తలెత్తినట్టు తెలిసింది. ఈ దాడిలో మొదట ముగ్గురు భారత సైనికులే మరణించారని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ తర్వాత మృతుల సంఖ్య భారీగా పెరిగింది. 20 మంది మరణించారని సైన్యం తెలిపింది. చైనా సైన్యాధికారుల ఫోన్‌ సంభాషణల ఆధారంగా 43మంది చైనా సైనికులు మరణించారని వార్తలు వెలువడ్డాయి. చైనా సైనికుల మృతిని గ్లోబల్‌ టైమ్స్‌ వార్తాసంస్థ ఎడిటర్‌ హు జిజిన్‌ ధృవీకరించారు. 1975 తర్వాత చైనా దాడిలో భారత సైనికులు చనిపోవటం ఇదే మొదటిసారి.  

భారత అభివృద్ధి చర్యలతో కంటగింపు

చైనాతో ఉన్న సరిహద్దు వెంట ఇటీవల భారత ప్రభుత్వం భారీ ఎత్తున మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నది. చైనా దుందుడుకు పోకడలను దృష్టిలో పెట్టుకొని, అత్యవసర పరిస్థితి ఎదురైతే బలగాలను సరిహద్దులకు త్వరగా తరలించేందుకు రోడ్లు, వైమానిక స్థావరాల నిర్మాణాన్ని మొదలుపెట్టింది. ఇదే చైనాకు కంటిగింపుగా మారింది. 

వ్యూహాలకు అడ్డా ‘గాల్వాన్‌'


అందుకే పట్టు కోసం డ్రాగన్‌ ప్రయత్నాలు

తూర్పు లఢక్‌లో  ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరుదేశాలకు చెందిన సైనిక అధికారులు చర్చలు జరుపుతున్న సమయంలో.. గాల్వాన్‌ లోయలో భారత జవాన్లపై చైనా దళాలు దాడి చేయడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో గాల్వాన్‌ లోయపై పట్టుకోసం చైనా ఎందుకు అంత ఉత్సుకత చూపుతున్నదన్న చర్చలు ఊపందుకున్నాయి. 

1962లో నిప్పు రాజేసింది

1962లో భారత్‌-చైనా మధ్య యుద్ధం జరిగింది. దీనికి బీజం వేసింది జీ219 రోడ్డు నిర్మాణం. తమ దేశంలోని జిన్‌జియాంగ్‌ నుంచి టిబెట్‌కు చైనా 179 కిలోమీటర్ల పొడువుతో ఈ రోడ్డు నిర్మించింది. అయితే, ఈ మార్గం భారత్‌లోని అక్సాయి చిన్‌ ప్రాంతం గుండా పోతున్నది. భారత్‌ సమ్మతి తీసుకోకుండానే చైనా ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. ఆ తర్వాత రోడ్డు మార్గం ఉన్న ప్రాంతమంతా తమదేనని ప్రకటించింది. యుద్దం ముగిసిన తర్వాత మరికొన్ని ప్రాంతాలను చైనా ఆక్రమించింది. 

చెక్‌ పెడుతున్న గాల్వాన్‌ లోయ

ఎత్తైన భూభాగాలు, పర్వత ప్రాంతాలను అక్రమంగా తన ఆధీనంలోకి తీసుకున్న చైనా.. ఎల్‌ఏసీ గుండా పటిష్ఠ నిఘాను ఏర్పాటు చేసింది. అయితే, పశ్చిమ వైపునకు వెళ్తున్న క్రమంలో గాల్వాన్‌ నది పరీవాహక ప్రాంతాల్లో ఎల్‌ఏసీ అతి తక్కువ ఎత్తులో ఉంటున్నది. ఇక్కడే గాల్వాన్‌ లోయ ఉన్నది. ఎత్తు తక్కువగా ఉన్న ఈ లోయ గుండా భారత బలగాలు సులభంగా అక్సాయి చిన్‌ ప్రాంతానికి చేరుకోవచ్చు. ఇది చైనాకు కునుకు లేకుండా చేస్తున్నది. దీంతో తూర్పు లఢక్‌లోని గాల్వాన్‌ లోయ ప్రాంతంపై తన పట్టును నిలుపుకోవాలని చైనా ప్రయత్నిస్తున్నది. గాల్వాన్‌ సమీపంలో ఉన్న పర్వత ప్రాంతాల్లో తన దళాలను మోహరించేందుకు ప్రయత్నిస్తున్నది. ప్రస్తుతం భారత్‌లో ఉన్న ఈ ప్రాంతాలపై చైనా దళాలు దాడులకు పాల్పడితే, ప్రతిచర్యలు జరిపేందుకు అవసరమైన సైనిక బలగాలు, ఆయుధాలు మన వద్ద తగినన్ని లేవనే చెప్పాలి.  logo