గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 21, 2020 , 02:44:20

రాజస్థాన్‌లో దళితులపై హింస

రాజస్థాన్‌లో దళితులపై హింస
  • ఏడుగురు అరెస్ట్‌.. పోలీసుల అదుపులో మరో ఏడుగురు అనుమానితులు
  • ఘటనపై దద్దరిల్లిన అసెంబ్లీ.. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి.. రాహుల్‌ ట్వీట్‌

జైపూర్‌, ఫిబ్రవరి 20: రాజస్థాన్‌లో ఇద్దరు దళితులను తీవ్రంగా హింసించిన ఘటనలో ఏడుగురిని అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు తెలిపారు. నాగౌర్‌ జిల్లా పంచౌఢీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కరను గ్రామంలో ఈ నెల 16న ఈ ఘటన జరిగింది. స్థానిక బైక్‌ సర్వీస్‌ ఏజెన్సీలో దొంగతనం చేశారనే నెపంతో ఇద్దరు దళిత యువకులను సిబ్బంది కట్టేసి బెల్టులతో తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత మర్మాంగాలపై పెట్రోల్‌ చల్లి హింసించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. అదేసమయంలో బైక్‌ సర్వీస్‌ ఏజెన్సీ నుంచి డబ్బులు చోరీ అయిన కేసు కూడా నమోదైందని చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై గురువారం రాజస్థాన్‌ అసెంబ్లీలో చర్చ జరిగింది. ప్రతిపక్ష రాష్ట్రీయ లోక్‌తంత్ర పార్టీ (ఆర్‌ఎల్పీ) సభ్యులు నారాయణ్‌ బేణివాల్‌, పుఖ్రాజ్‌, ఇంద్రా దేవి అసెంబ్లీ హాల్‌లో ప్లకార్డులు ప్రదర్శించారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. అనంతరం వాకౌట్‌ చేశారు. అసెంబ్లీ ఆవరణలో బైఠాయించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని బీజేపీ విమర్శించింది. ఈ నేపథ్యంలో సీఎం అశోక్‌ గెహ్లాట్‌ స్పంది స్తూ.. నిందితులపై చర్యలు తీసుకుంటున్నామని, ఎవరినీ వదిలేదిలేదని స్పష్టం చేశారు. మరోవైపు నాగౌర్‌ ఘటనను కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఖండించారు. దళితులపై దాడిని క్రూరమైన చర్యగా అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరుతూ ట్వీట్‌ చేశారు. రాహుల్‌ ట్వీట్‌పై బీజేపీ మండిపడింది. ‘రాహుల్‌ గాంధీ కేవలం ట్వీట్లతోనే పనిచేస్తారు. కనీసం రాహుల్‌ ట్వీట్‌ తర్వాతైనా గెహ్లాట్‌ ప్రభుత్వం స్పందిస్తే ప్రజలకు న్యాయం లభిస్తుంది’ అని బీజేపీ నేత సతీశ్‌ పూనియా మీడియాతో పేర్కొన్నారు.


logo