గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 20, 2020 , 10:26:12

నిర్భయ దోషి వినయ్‌ కుమార్‌ ఆత్మహత్యాయత్నం

నిర్భయ దోషి వినయ్‌ కుమార్‌ ఆత్మహత్యాయత్నం

న్యూఢిల్లీ : తీహార్‌ జైల్లో నిర్భయ దోషి వినయ్‌ కుమార్‌ శర్మ ఆత్మహత్యాయత్నం చేశాడు. జైలు గోడకు తల బాదుకోవడంతో వినయ్‌ శర్మకు గాయాలు అయ్యాయి. దీంతో అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు జైలు అధికారులు. ఈ నెల 16న వినయ్‌ శర్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 3న ఉదయం 6 గంటలకు నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలని న్యాయస్థానం తీర్పు వెల్లడించిన విషయం విదితమే. 

మార్చి 3న ఉదయం 6 గంటలకు నలుగురు దోషులను ఉరితీయాలని అదనపు సెషన్స్‌ జడ్జి ధర్మేందర్‌ రాణా సోమవారం ఆదేశించిన విషయం తెలిసిందే. దోషులు ముఖేశ్‌కుమార్‌సింగ్‌ (32), పవన్‌ గుప్తా (25), వినయ్‌కుమార్‌ శర్మ (26), అక్షయ్‌ కుమార్‌ (31)పై కోర్టు డెత్‌ వారంట్‌ జారీచేయడం ఇది మూడోసారి. శిక్షను వాయిదా వేయించేందుకు దోషులు పలు రకాల ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. చివరి నిమిషంలో ఒక కొత్త పిటిషన్‌ దాఖలు చేస్తుండటంతో శిక్ష అమలు వాయిదా పడుతూ వస్తున్నది.  

దోషులకు డెత్‌ వారంట్లు జారీ చేయాలని కోరుతూ నిర్భయ తల్లిదండ్రులు, ఢిల్లీ ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్లపై ఢిల్లీలోని పటియాలా హౌస్‌ కోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా దోషుల్లో ఒకడైన ముఖేశ్‌.. తన తరఫున న్యాయవాది వృందా గ్రోవర్‌ వాదించరాదని చెప్పాడు. దీంతో న్యాయస్థానం న్యాయవాది రవి ఖాజీని నియమించింది. మరో దోషి వినయ్‌ తీహార్‌ జైలులో నిరాహారదీక్ష చేస్తున్నాడని అతని తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. జైలులో వినయ్‌పై దాడి జరిగిందని, తలకు గాయమైందని, దీంతో అతడు మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని చెప్పారు. అందువల్ల అతనికి మరణశిక్షను అమలు చేయరాదని అన్నారు. ఈ నేపథ్యంలో వినయ్‌ విషయంలో చట్టం ప్రకారం వ్యవహరించాలని తీహార్‌ జైలు సూపరింటెండెంట్‌ను కోర్టు ఆదేశించింది. ఇక పవన్‌ తరఫు న్యాయవాది మాట్లాడుతూ, సుప్రీంకోర్టులో క్యురేటివ్‌ పిటిషన్‌, రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష పిటిషన్‌ దాఖలు చేయాలనుకుంటున్నామని చెప్పారు. నలుగురు దోషుల్లో పవన్‌ మాత్రమే ఇంతవరకు క్యురేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేయలేదు, రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరలేదు. రాష్ట్రపతిని తాము మరోసారి క్షమాభిక్ష కోరనున్నామని అక్షయ్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 

ముగిసిన గడువు

ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన వారం రోజుల గడువు ముగిసిందని, దోషులకు సంబంధించి ఎటువంటి పిటిషన్‌ ఏ కోర్టులోనూ పెండింగ్‌లో లేదని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రాజీవ్‌ మోహన్‌ కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రయల్‌ కోర్టు మార్చి 3న నలుగురిని ఉరితీయాలని తాజా డెత్‌ వారంట్లు జారీ చేసింది


logo