బుధవారం 03 జూన్ 2020
National - Mar 31, 2020 , 10:03:13

బీహార్‌లో అమానుషం: క‌రోనా అనుమానంతో వ్య‌క్తి దారుణ హ‌త్య‌

బీహార్‌లో అమానుషం: క‌రోనా అనుమానంతో వ్య‌క్తి దారుణ హ‌త్య‌

 ప‌ట్నా: క‌రోనా మ‌హ‌మ్మారి జ‌న‌జీవ‌నాన్ని స్తంభింపజేయ‌డ‌మే కాదు ఎన్నో దారుణాల‌కు కూడా కార‌ణ‌మ‌వుతున్న‌ది. మ‌నుషుల్లో మాన‌వ‌త్వాన్ని కూడా చంపేస్తున్న‌ది. ఆఖ‌రికి సాటి మ‌నుషుల‌ని కూడా చూడ‌కుండా కొట్టిచంపే ప‌రిస్థితులు తీసుకొచ్చింది. బీహార్లో ఇలాంటి  అమానుష ఘ‌ట‌నే చోటుచేసుకుంది. బ‌తుకుదెరువు కోసం భార్య‌ పిల్ల‌ల‌తో మ‌హారాష్ట్రకు వెళ్లి ఉపాధి దొర‌క‌క తిరిగొచ్చిన ఓ వ్య‌క్తిని సొంత గ్రామ‌స్తులే దారుణంగా హ‌త్య చేశారు. 


బీహార్ రాష్ట్రం సీతామ‌ర్హి జిల్లాలోని ఓ గ్రామంలో సోమ‌వారం ఈ దారుణం జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళ్తే.. బ‌తుకుదెరువు కోసం క‌టుంబంతో స‌హా మహారాష్ట్రకు వెళ్లిన ఓ వ్య‌క్తి.. లాక్‌డౌన్ కార‌ణంగా ఉపాధి దొర‌క‌క పోవ‌డంతో సోమ‌వారం స్వ‌గ్రామానికి వ‌చ్చాడు. అయితే గ్రామ‌స్తులు అతని కుటుంబాన్ని గ్రామంలో అడుగుపెట్ట‌నీయ‌లేదు. మ‌హారాష్ట్రలో క‌రోనా కేసులు ఎక్కువ‌గా ఉన్నందున అతని కుటుంబానికి కూడా క‌రోనా సోకింద‌ని అనుమానించారు.


దీంతో, త‌మ‌లో ఎవ‌రికీ క‌రోనా లేద‌ని, ఉన్న ఊర్ల‌కు రానియ్య‌క‌పోతే తాను త‌న కుటుంబం ఎక్క‌డ బ‌తుకాల‌ని అత‌డు బ‌తిమాలాడు. అయినా విన‌కుండా గ్రామంలోని కొంద‌రు వ్య‌క్తులు అత‌నిపై దాడికి పాల్ప‌డ్డారు. విచ‌క్ష‌ణార‌హితంగా కొట్ట‌డంతో అత‌డు అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించాడు. స‌మాచారం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని ఏడుగురు నిందితుల‌ను అరెస్ట్ చేశారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృత‌మైతే క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని గ్రామ‌స్తుల‌ను హెచ్చ‌రించారు. 


logo