గురువారం 02 జూలై 2020
National - Jun 28, 2020 , 16:42:49

కనడ గ్రామానికి విద్యుత్‌ కాంతుల ‘సౌభాగ్యం’

కనడ గ్రామానికి విద్యుత్‌ కాంతుల ‘సౌభాగ్యం’

బలరాంపూర్‌ : ఛతీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బలరాంపూర్‌ జిల్లా కనడ గ్రామానికి విద్యుత్‌ కాంతులు రానున్నాయి. ఏండ్లగా గ్రామస్తులు విద్యుత్‌ లేక కష్టాల నడుమ కాలం వెల్లదీశారు. సౌభాగ్యలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఇంటింటికి విద్యుత్‌ సౌకర్యం కల్పించనుండడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ‘విద్యుత్‌ సౌకర్యం లేక మా పిల్లల చదువుపై తీవ్ర ప్రభావం పడుతోంది. మా తరంవారిమంతా ఇదే సమస్య కారణంగా ఇబ్బందులు పడ్డాం. గ్రామానికి విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తుండడం మా పిల్లల భవిష్యత్‌కు గొప్ప ఊరటనిచ్చే అంశం. ఇక మాలాగ వాళ్లూ కష్టాలుపడరు’ అని ఓ గ్రామస్తుడు పేర్కొన్నారు.

ఈ మార్పును మేం స్వాగతిస్తున్నాం. రాత్రివేళ చదువుకునేందుకు.. బయటకు వెళ్లేందుకు మాకు చాలా సులుభంగా ఉంటుందని ఓ యువకుడు సంతోషం వ్యక్తం చేశాడు. సౌభాగ్యలక్ష్మి పథకం కింద గ్రామంలోని 269ఇండ్లపై సోలార్‌ ప్యానెళ్లతోపాటు లోపల లైట్‌, ఫ్యాన్‌ బిగించనున్నారు. ‘ఈ గ్రామం ఏకాంతంగా ఉండి చుట్టూ జనసంచారం ఉండదు. విద్యుత్‌ వెలుగు వస్తే గ్రామస్తుల జీవితాల్లో పెనుమార్పు వస్తుంది’ అని ఆ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి ఏజెన్సీ అసిస్టెంట్‌ అధికారి సుమన్‌ కిండో అన్నారు.


logo