శనివారం 06 జూన్ 2020
National - May 15, 2020 , 19:55:40

రైతు ఉత్పత్తుల విక్రయానికి కొత్త చట్టం తేవడం ముదావహం

రైతు ఉత్పత్తుల విక్రయానికి కొత్త చట్టం తేవడం ముదావహం

ఢిల్లీ : రైతుల ఉత్పత్తుల విక్రయానికి కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తేవాలని నిర్ణయించడం ముదావహమని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీ-3లో భాగంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు వ్యవసాయం, అనుబంధ రంగాలకు ప్యాకేజీని ప్రకటించారు. దీనిపై వెంకయ్య నాయుడు ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ... దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న  సంస్కరణలతో రైతులకు మేలు జరుగుతుందన్నారు. పప్పు ధాన్యాలు, వంట నూనెలు, నూనె గింజలు, ఆలుగడ్డలు, ఉల్లిగడ్డల అమ్మకానికి నిబంధనల సడలింపు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయరంగ మౌలిక వసతులు, మత్స్య, పశుసంవర్ధక రంగాల బలోపేతానికి తీసుకున్న చర్యలు ఈ రంగానికి కొత్త శక్తిని ఇస్తాయన్నారు. కేంద్రం నిర్ణయాలు ఇటు ఉత్పత్తిదారులతో పాటు అటు వినియోగదారులకు కూడా మేలు చేస్తాయని పేర్కొన్నారు.


logo