ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 16:59:13

పారదర్శకత, సుపరిపాలన ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలు : ఉపరాష్ట్రపతి.

పారదర్శకత, సుపరిపాలన ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలు : ఉపరాష్ట్రపతి.

ఢిల్లీ : డాక్టర్ అంబేడ్కర్ దూరదృష్టి కారణంగానే.. కాగ్ వంటి సంస్థల ఏర్పాటుతోపాటు వీటికి స్వయం ప్రతిపత్తి దక్కిందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. బుధవారం ఢిల్లీలోని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ‘రాజనీతిజ్ఞతతోపాటు సంఘ సంస్కర్తగా, తత్వవేత్తగా, మేధావిగా, న్యాయకోవిదుడిగా, ఆర్థికవేత్తగా, రచయితగా, మానవతా మూర్తిగా బహుముఖ ప్రజ్ఞ కలిగిన గొప్ప వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్. ప్రపంచంలోనే దృఢమైన రాజ్యాంగం కలిగుండటం భారతదేశ ప్రత్యేకత. దీని రూపకల్పనతోపాటు క్లిష్టమైన సమయంలో బాబాసాహెబ్ అంబేడ్కర్ పోషించిన పాత్ర అత్యంత కీలకం‘ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

ప్రభుత్వం యంత్రాంగం లోపాలను సరిదిద్దుకుని మార్పులు, చేర్పులతో మరింత సమర్థవంతంగా ముందుకెళ్లేందుకు కాగ్ ఇచ్చే నివేదికలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. భారతదేశాభివృద్ధికి అవినీతి ఓ అవరోధంగా మారిందని.. దీన్ని దేశం నుంచి పారద్రోలేందుకు ప్రభుత్వంతోపాటుప్రజలు సంయుక్తంగా పనిచేయాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగం నేటికీ దేశానికి ఓ మార్గదర్శిగా దారిచూపిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అలాంటి రాజ్యాంగ పవిత్రతను కాపాడటంలో ప్రతి భారతీయుడు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన అన్నారు.

బడుగు, బలహీన, అణగారిన వర్గాల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న డాక్టర్ అంబేడ్కర్.. తన జీవితంలో చివరి క్షణం వరకు సామాజిక అసమానత, కుల, లింగ వివక్షతకు వ్యతిరేకంగా మహిళా సాధికారతకోసం కృషిచేశారన్నారు. ‘ఇలాంటి మహనీయుల జీవితాన్ని, వారు చూపిన ఆదర్శాలను గుర్తుచేసుకుని.. వాటినుంచి మనతోపాటు భవిష్యత్ తరాలు స్ఫూర్తి పొందడమే.. వీరి విగ్రహాలను ఏర్పాటుచేయడం వెనక ఉద్దేశం’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. 



logo