ఆదివారం 05 జూలై 2020
National - Jun 29, 2020 , 01:22:44

క్లిష్టదశలో దేశానికి పీవీ నాయకత్వం

క్లిష్టదశలో దేశానికి పీవీ నాయకత్వం

  • మాజీ ప్రధానికి మోదీ ఘన నివాళులు
  • పీవీ సేవలు చిరస్మరణీయం: వెంకయ్య 

న్యూఢిల్లీ, జూన్‌ 28: దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆదివారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. మన్‌కీబాత్‌ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు పీవీ నాయకత్వ బాధ్యతలు చేపట్టారని గుర్తుచేశారు. భారతీయ విలువలకు ఆయన నిలువెత్తు నిదర్శనమని, అలాగే పాశ్చాత్య సాహిత్యం, సైన్స్‌పైనా ఆయనకు గట్టి పట్టు ఉన్నదని చెప్పారు. భారత్‌లో అత్యంత అనుభవజ్ఞులైన రాజకీయ నేతల్లో పీవీ ఒకరని, గొప్ప రాజనీతిజ్ఞుడని పేర్కొన్నారు. టీనేజ్‌లోనే ఆయన స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారని చెప్పారు. వందేమాతరం ఆలపించేందుకు హైదరాబాద్‌ నిజాం అనుమతి ఇవ్వకపోతే, నిజాంకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పీవీ కీలకపాత్ర పోషించారని తెలిపారు. ఆర్థిక సంస్కరణల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన వైతాళికుడు పీవీ నరసింహారావు అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. పీవీ గొప్ప కార్యదక్షుడని, బహుముఖ ప్రజ్ఞాశాలి అని కీర్తించారు. కాలేజీ స్థాయి వరకు మాతృభాషనే మాధ్యమంగా కొనసాగించాలని ఆయన నొక్కిచెప్పేవారని గుర్తుచేశారు. దేశాభివృద్ధికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని ట్వీట్‌ చేశారు.


logo