గురువారం 26 నవంబర్ 2020
National - Nov 11, 2020 , 15:35:40

2వ జాతీయ జల అవార్డుల కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి

 2వ జాతీయ జల అవార్డుల కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి

హైదరాబాద్ : జలసంరక్షణ అంశంలో యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని  భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు  అన్నారు. లేకపోతే భవిష్యత్ లో తాగునీటికి తీవ్ర కొరత తప్పదని అన్నారు. జల వినియోగాన్నితగ్గించడం, పునర్వినియోగించడం, శుద్ధిచేసి వినియోగించుకోవడంపై మరింత దృష్టిపెట్టాలని.. ఈ దిశగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. బుధవారం 2వ జాతీయ జల అవార్డుల కార్యక్రమాన్ని హైదరాబాద్ నుంచి వర్చువల్ విధానం ద్వారా ఉపరాష్ట్రపతి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నీరు అపరిమిత వనరు కాదు. భూమిపై జలం పరిమితమే’ అనే విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు.. ప్రతి నీటి చుక్కను కాపాడుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ.. పెద్ద ఎత్తున గ్రామాలు, పట్టణాల్లో దీనిపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, సామాజిక కేంద్రాలు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవోలు, స్థానిక సంస్థలు ఈ అవగాహన, చైతన్య కార్యక్రమాల్లో కీలక భాగస్వామ్యం పోషించాలన్నారు.

భూ మండలంలో అందుబాటులో ఉన్న నీటిలో కేవలం 3శాతం మాత్రమే స్వచ్ఛమైనదని,  అందులో 0.5శాతం మాత్రమే తాగేందుకు వీలైనదని పేర్కొన్న ఉపరాష్ట్రపతి, అలాంటి విలువైన తాగునీటి వనరులను సంరక్షించుకోవడం తద్వారా భవిష్యత్తులో నీటి కొరత రాకుండా చూసుకోవడం ప్రతి పౌరుడి బాధ్యతని సూచించారు. ‘ప్రతి ఒక్కరూ తమ జీవనశైలిని మార్చుకోవడంతోపాటు, నీటి వనరులను కాపాడుకోవడం తక్షణావసరం’ అని ఆయన పిలుపునిచ్చారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.