శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Feb 13, 2020 , 03:17:43

నిర్భయ ఢిల్లీకి ఎందుకు వెళ్లింది?

నిర్భయ ఢిల్లీకి ఎందుకు వెళ్లింది?
  • నిర్భయ తాతతో వైద్యాధికారి వివాదాస్పద వ్యాఖ్యలు
  • విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్‌

బల్లియా: నిర్భయ ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లా వైద్యాధికారి (సీఎంఓ) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. నిర్భయ స్వగ్రామమైన మెర్‌హ్వార్‌ కాలా గ్రామంలో ప్రభుత్వం ఆమె పేరుతో ఒక దవాఖానను ప్రారంభించింది. కానీ  ఎటువంటి సదుపాయాలు కల్పించకపోగా, డాక్టర్‌ను కూడా కేటాయించలేదు. దీంతో గ్రామస్థులు కొన్ని రోజులుగా ఆందోళన బాట పట్టారు. నిరసనకారులతో మాట్లాడేందుకు మంగళవారం గ్రామానికి వచ్చిన సీఎంఓ డాక్టర్‌ ప్రీతమ్‌ మిశ్రా అనుచితంగా వ్యవహరించారు. ‘నిర్భయ గ్రామంలో ఒక్కరు కూడా వైద్యవిద్యను అభ్యసించలేదు. కానీ ఇక్కడి ప్రజలకు డాక్టర్లు కావాలి. ముందు వైద్యవిద్యను అభ్యసించి.. ఇక్కడే డాక్టర్‌గా పనిచేయండి. ఈ గ్రామం ఇప్పటివరకు ఒక్క డాక్టర్‌ను కూడా చదివించలేదు. మరి ఇక్కడ దవాఖాన ఎందుకు ప్రారంభించారు’ అని వ్యాఖ్యానించారు. నిర్భయ తాత లాల్జీసింగ్‌తో మాట్లాడుతూ ‘అసలు నిర్భయ ఢిల్లీకి ఎందుకు వెళ్లింది. ఢిల్లీ వెళ్లాల్సిన అవసరమేమొచ్చింది’ అని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో వైరల్‌ అయ్యాయి. దీనిపై వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్‌ హరిప్రతాప్‌ షాహి వెంటనే దర్యాప్తుకు ఆదేశించారు.దోషులకు ఉరిశిక్ష జాప్యంపై కోర్టు వద్ద ఆశాదేవి నిరసన

న్యూఢిల్లీ: దోషులకు ఉరిశిక్ష అమలులో జరుగుతున్న జాప్యంపై నిర్భయ తల్లి ఆశాదేవి బుధవారం ఢిల్లీ కోర్టు వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. ఏడేండ్లయినా తన కూతురుకు న్యాయం జరుగడం లేదంటూ భావోద్వేగానికి గురయ్యారు. దోషులకు డెత్‌ వారంట్‌ జారీ చేయాలంటూ నిర్భయ తల్లిదండ్రులు, ఢిల్లీ ప్రభుత్వం స్థానిక కోర్టును ఆశ్రయించారు. దీనిపై బుధవారం విచారణ సందర్భంగా దోషుల్లో ఒకడైన పవన్‌గుప్తా తన తరఫున వాదించేందుకు న్యాయవాదులెవరూ లేరని విన్నవించాడు. స్పందించిన అదనపు సెషన్స్‌ జడ్జి ధర్మేందర్‌ రాణా దోషికి న్యాయం సహాయం అందించాలని ఆదేశించారు. దీంతో జిల్లా న్యాయ సేవల సంస్థ తమ వద్దనున్న న్యాయవాదుల జాబితాను పవన్‌ గుప్తా తండ్రికి ఇచ్చి వారిలో నుంచి ఒకరిని ఎంపిక చేసుకోవాలని సూచించింది. డెత్‌ వారంట్లపై గురువారం విచారణ జరుగనుంది.

logo