శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 17:56:44

తిలక్‌, ఆజాద్‌లను స్మరించుకున్న వెంకయ్య

తిలక్‌, ఆజాద్‌లను స్మరించుకున్న వెంకయ్య

న్యూఢిల్లీ : భారత స్వరాజ్య సంగ్రామంలో విప్లవాత్మక మార్పునకు బీజం వేసిన ఇద్దరు దేశభక్తులు బాలగంగాధర్‌ తిలక్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌లను భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్మరించుకున్నారు. గురువారం ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ ద్వారా వారికి నివాళులర్పించిన వెంకయ్య.. వారి నిరుపమాన సేవలను భవిష్యత్‌ తరాలు మరిచిపోకుండా ఉండేందుకు మనం గుర్తుచేస్తుండాలన్నారు. 

భారత స్వాతంత్ర్య సమర సేనాని, ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అని నినదించి ప్రజల్లో స్వాతంత్ర్యకాంక్షను రగిలించిన లోకమాన్య బాలాగంగాధర్ తిలక్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తున్నాను. సార్వజనిక వినాయక ఉత్సవాలతో సమాజాన్ని ఏకం చేసి వారు చేసిన మార్గదర్శనం సదా స్మరణీయం అని ట్విట్టర్లో పేర్కొన్నారు. గతంలో ఇంటికే పరిమితమైన వినాయక చవితి పూజలను ‘సార్వజనిక్ గణేశ్ మహోత్సవ్’ పేరిట బహిరంగ కార్యక్రమాలుగా మలచి, జాతీయ స్ఫూర్తి బీజాలను ప్రతి ఒక్కరిలో నాటే ప్రయత్నం చేశారని వెంకయ్య గుర్తుచేశారు.

దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో ఆంగ్లేయులకు కంటిమీద కునుకులేకుండా చేసిన స్వాతంత్ర్య వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులర్పిస్తున్నాను. చిన్న వయసులోనే దేశభక్తి, శౌర్యాన్ని ప్రదర్శించి భగత్‌సింగ్ వంటి వారెందరికో మార్గదర్శనం చేశారని తన పోస్ట్‌లో తెలిపారు.

యువతరాన్ని ఉత్తేజపరిచేందుకు త్యాగం, దేశభక్తికి ప్రతీకగా నిలిచే దిగ్గజ జాతీయ నాయకులు, స్వాతంత్ర్య సమరయోధుల జీవితాల మీద పాఠ్య ప్రణాళిక దృష్టి కేంద్రీకరించాలన్నారు. సమాచార మాధ్యమాలు సైతం కేవలం వారి స్మారక సందర్భాల నేపథ్యంలోనే కాకుండా మిగిలిన సమయాల్లో సందర్భానుగుణంగా వారి జీవితాలను ఆవిష్కరించే ప్రయత్నాలు చేస్తూ ఉండాలన్నారు. ఈ రోజు ఈ ఉక్కు సంకల్ప స్వరాజ్య పోరాట యోధులకు నివాళులు అర్పించడమే గాక, వారి కలలను సాకారం చేసే దిశగా కంకణబద్ధులమయ్యేందుకు ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకోవాలని, యువతరం వారి జీవితం నుంచి స్ఫూర్తి పొందాలని వెంకయ్య ఆకాంక్షించారు.logo