ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 22:50:55

జూలై 31న తిరుచానూరు ఆలయంలో వరలక్ష్మీ వ్రతం

 జూలై 31న తిరుచానూరు ఆలయంలో వరలక్ష్మీ వ్రతం

 తిరుపతి : సిరులత‌ల్లి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జూలై  31న వరలక్ష్మీ వ్రతం ఏకాంతంగా జరుగనున్నది. ఈ వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తాన్ని భ‌క్తుల కోరిక మేర‌కు వర్చువల్ విధానంలో ‌నిర్వహించాలని టిటిడి నిర్ణ‌యించింది. భ‌క్తులు  త‌మ నివాస ప్రాంతాల నుండి ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారంలో వీక్షించడం ద్వారా అమ్మవారి సేవలో ప్రత్యక్షంగా పాల్గొన్నామన్న భావన కలుగుతుంది. వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం టికెట్లు జూలై 22వ తేదీ సాయంత్రం 5.00 గంట‌ల నుండి ఆన్ లైన్లో అందుబాటులో ఉన్నాయి. జూలై 30వ తేదీ సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు గృహ‌స్తులు బుక్ చేసుకోవచ్చు.

ఈ కార్య‌క్ర‌మం జూలై 31వ తేదీ  ఉద‌యం 10 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ఎస్వీబీసీలో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం కానున్నది. ఈ సేవ‌లో పాల్గొనే భ‌క్తుల‌కు తొలి శ్రావ‌ణ శుక్ర‌వారం పూజ‌లో అర్పించిన ఉత్త‌రియం, ర‌విక‌, ప‌సుపు, కుంకుమ‌, కంక‌ణాలు, గాజులు ప్ర‌సాదంగా ఇండియా పోస్ట‌ల్ ద్వారా గృహ‌స్తుల చిరునామాకు పంప‌డం జ‌రుగుతుంది. విదేశాల‌లో ఉన్న భ‌క్తులకు ప్ర‌సాదాలు పంప‌డం సాధ్యం కాదని, ఈ విషయాన్ని గమనించాలని టిటిడి స్పష్టం చేసింది.


logo