కార్గిల్ యుద్ధం సమయంలో షరీఫ్‌తో మాట్లాడిన వాజ్‌పేయి

న్యూఢిల్లీ: ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన కార్గిల్ యుద్ధం సమయంలో అప్పటి రెండు దేశాల ప్రధానులు అటల్ బిహారీ వాజ్‌పేయి, నవాజ్ షరీఫ్ ఫోన్లో మాట్లాడుకున్నారని తాజాగా ఓ పుస్తకం బయటపెట్టింది. ఈ ఇద్దరూ కనీసం నాలుగైదుసార్లు ఫోన్లో మాట్లాడినట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా షరీఫ్‌ను పక్కన పెట్టిన జనరల్ పర్వేజ్ ముషారఫ్ నేతృత్వంలోని పాక్ ఆర్మీ ఈ యుద్ధానికి దిగినట్లు వాజ్‌పేయి తెలుసుకున్నారని ఆ పుస్తకం తెలిపింది. మాజీ సీనియర్ అధికారి, వాజ్‌పేయి వ్యక్తిగత కార్యదర్శిగా చేసిన శక్తి సిన్హా.. వాజ్‌పేయి: ద ఇయర్స్ దట్ చేంజ్డ్ ఇండియా పేరుతో రాసిన పుస్తకంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.
ఆబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఓఆర్ఎఫ్) మాజీ చీఫ్ ఆర్కే మిశ్రా, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో మాట్లాడిన తర్వాత ఇద్దరు ప్రధానుల మధ్య ఫోన్ సంభాషణ ఏర్పాటు చేసినట్లు ఆ పుస్తకంలో శక్తి సిన్హా చెప్పారు. తన ఇంట్లో తానే బంధీగా అయిపోయినట్లుగా షరీఫ్ చెప్పారని, ఇదే విషయాన్ని మిశ్రా.. ప్రధాని వాజ్‌పేయికి చేరవేశారని ఆ పుస్తకం వెల్లడించింది. దీంతో ఒకటిన్నర నెలల పాటు జరిగిన ఆ యుద్ధ సమయంలో నాలుగైదుసార్లు షరీఫ్‌తో వాజ్‌పేయి మాట్లాడారు. చివరికి జులై 4వ తేదీన తమ బలగాలను వెనక్కి రప్పిస్తున్నట్లు పాక్ ప్రధాని.. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు చెప్పారు అని ఆ పుస్తకం తెలిపింది.
ఈ నాలుగైదు కాల్స్‌లో ఒకటి వాజ్‌పేయి శ్రీనగర్ పర్యటనలో ఉన్నపుడు కూడా జరిగిందని కూడా శక్తి సిన్హా చెప్పారు. అయితే జమ్ముకశ్మీర్ నుంచి పాకిస్థాన్‌కు కాల్స్ వెళ్లకుండా నిషేధం విధించడం వల్ల వాజ్‌పేయి.. మొదట్లో పాక్ ప్రధానితో మాట్లాడలేకపోయారని, ఆ తర్వాత ప్రత్యేకంగా ఈ కాల్ కోసమే కాసేపు టెలికాం అధికారులు.. జమ్ముకశ్మీర్ నుంచి పాక్‌కు కాల్స్‌ను పునరుద్ధరించినట్లు కూడా గుర్తు చేశారు. ఈ వివాదంలో పాకిస్థాన్ ఆర్మీ హస్తం ఉన్నట్లు అప్పటి ఆర్మీ చీఫ్ ముషారఫ్, చీఫ్ జనరల్ స్టాఫ్ మహ్మద్ అజీజ్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణతో స్పష్టమైంది. ఈ సంభాషణ టేప్‌ను అప్పటి రా చీఫ్ అరవింద్ దవే సంపాదించడంతో పాక్ దుర్మార్గం తేటతెల్లమై.. తమ బలగాలను వెనక్కి తీసుకోవడం తప్ప మరో మార్గం లేకుండా పోయిందని కూడా శక్తి సిన్హా తన పుస్తకంలో వెల్లడించారు.