మంగళవారం 19 జనవరి 2021
National - Dec 22, 2020 , 15:19:49

శ్రీ‌వారి ఆల‌యంలో 25న వైకుంఠ ఏకాద‌శి, 26న వైకుంఠ ద్వాద‌శి

శ్రీ‌వారి ఆల‌యంలో 25న వైకుంఠ ఏకాద‌శి, 26న వైకుంఠ ద్వాద‌శి

తిరుపతి : తిరుమల వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో  25వ తేదీ శుక్రవారం వైకుంఠ ఏకాదశి, 26న వైకుంఠ ద్వాదశి పర్వదినాలు జ‌రుగ‌నున్నాయి. ఈ సంద‌ర్భంగా శుక్రవారం నుంచి జ‌న‌వ‌రి 3వ తేదీ వ‌ర‌కు 10 రోజుల పాటు భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శనం క‌ల్పిస్తారు. ఇందులో భాగంగా 25న తెల్లవారుజామున 12.05 నుంచి 1.30 గంటల వరకు ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావైతో శ్రీవారిని మేల్కొలిపి ఏకాంతంగా ధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తారు. ఉద‌యం 1.30 నుంచి 2.30 గంట‌ల వ‌ర‌కు ఏకాంతంగా అభిషేకం చేప‌డ‌తారు. నిజ‌పాద ద‌ర్శనం ఉండ‌దు. ఆ త‌రువాత ఏకాంతంగా తోమాల సేవ‌, అర్చన నిర్వహిస్తారు. ఉద‌యం 4.30 గంట‌ల నుంచి భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.

ఉద‌యం 9 గంట‌ల‌కు స్వర్ణరథం..

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 9 నుంచి 11 గంటల నడుమ శ్రీదేవి భూదేవి సమేతమలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగుమాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సహస్రదీపాలంకార సేవ జరుగనుంది. అనంతరం స్వామివారు ఉభయనాంచారులతో క‌లిసి తిరుచ్చిపై నాలుగుమాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 9 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు రంగ‌నాయ‌కుల మండ‌పంలో అధ్యయనోత్సవ కార్యక్రమాలు చేప‌డ‌తారు.

ఈ నెల 26న చక్రస్నానం..

26వ తేదీ శనివారం వైకుంఠ ద్వాదశి పర్వదినాన స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటి తిరుమలలో జరుగనుంది. ఈ సందర్భంగా ఉదయం 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు చక్రత్తాళ్వార్లను నాలుగుమాడ వీధులలో ఊరేగింపుగా తీసుకెళ్లి వరాహస్వామి ఆలయం చెంత గ‌ల‌ స్వామివారి పుష్కరిణి తీర్థంలో చక్రస్నానం నిర్వహిస్తారు. కొవిడ్-19 దృష్ట్యా చక్రస్నానంను ఎకాంతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఆర్జిత సేవ‌లు ర‌ద్దు..

వైకుంఠ ఏకాద‌శి, ద్వాద‌శి ప‌ర్వదినాల నేప‌థ్యంలో ఈనెల 24 నుంచి 26వ తేదీ వ‌ర‌కు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఆర్జిత‌సేవ‌ల‌ను టిటిడి రద్దు చేసింది.