బుధవారం 02 డిసెంబర్ 2020
National - Nov 12, 2020 , 11:39:13

జలప్రవేశం చేసిన ‘వాగిర్‌’ జలాంతర్గామి

జలప్రవేశం చేసిన ‘వాగిర్‌’ జలాంతర్గామి

ముంబై : స్కార్పీన్‌ క్లాస్‌ వాగిర్‌ జలాంతర్గామి మజగాన్‌ డాక్‌ వద్ద అరేబియా సముద్ర జలాల్లో గురువారం జలప్రవేశం చేసింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్‌ నాయక్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో నిర్మిస్తున్న ఆరు కల్వరీ క్లాస్‌ జలాంతర్గాముల్లో ఐఎన్‌ఎస్‌ వాగిర్‌ ఐదోది. ఫ్రెంచ్‌ నావికాదళ రక్షణ, ఇంధన సంస్థ డీసీఎన్‌ఎస్‌ రూపొందించిన జలంతార్గములను భారత నావికాదళం ప్రాజెక్ట్‌-75లో భాగంగా ముంబైలోని మజగాన్‌ డాక్‌ లిమిటెడ్‌ (ఎండీఎల్‌) నిర్మిస్తోంది. ఆరు స్కార్పీన్‌ క్లాస్ జలాంతర్గాముల్లోని మొదటిదైన ఐఎన్ఎస్ కల్వరిని 2017 డిసెంబర్‌లో భారత నావికాదళంలోకి ప్రవేశపెట్టారు. ఇది డీజిల్-ఎలక్ట్రిక్ అటాక్ జలాంతర్గామి. ఐఎన్ఎస్ ఖండేరి (2017) రెండవది కాగా..  మూడోది ఐఎన్ఎస్ కరంజ్ (2018), నాల్గోది ఐఎన్‌ఎస్‌ వెలా (2019). స్కార్పీన్ జలాంతర్గాములు అనేక రకాలైన మిషన్లను చేపట్టగలవు. యాంటీ-సర్ఫేస్ వార్‌ఫేర్‌, యాంటీ- సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌, ఇంటెలిజెన్స్ సేకరణ, మైన్‌ లేయింగ్‌, తీర ప్రాంతాల్లో నిఘా తదితర మిషన్లు చేపట్టవచ్చు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.